పూణే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ లాంటి కీలక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయగల నలుగురు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటంతో ఇరు జట్లు ఆందోళన చెందుతున్నాయి.
ఇదిలా ఉండగా ఆటగాళ్ల గాయాల విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సైతం గుబులు రేపుతోంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లు వరుసపెట్టి గాయాలబారిన పడటంపై ఆయా ఫ్రాంచైజీలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. గాయాలపాలైన ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కెప్టెన్లు కావడం.. ఆయా ఫ్రాంచైజీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు రోహిత్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహిస్తున్నారు.
ఇప్పటికే టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని తొలి భాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య జరుగబోయే తదుపరి రెండు వన్డేల్లో ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. కాగా, ఐపీఎల్‌లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే వారం రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్ 9న ప్రారంభంకాబోయే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
చదవండి: ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..!
Comments
Please login to add a commentAdd a comment