సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 162 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 27 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆసీస్ చేధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కంగారులు సొంతం చేసుకున్నారు. కాగా టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయం కారణంగా మూడో రోజు ఫీల్డింగ్‌కు దిగలేదు. బుమ్రా లేని లోటు భారత బౌలింగ్ ఎటాక్‌లో స్పష్టంగా కన్పించింది.
తొలి రెండో ఓవర్లలోనే భారత పేసర్లు ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నారు. అందులో 12 పరుగులు ఎక్స్‌ట్రాస్ రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. ముఖ్యంగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన రిథమ్‌ను కోల్పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.
తొలి ఓవర్ వేసిన సిరాజ్ 13 పరుగులిచ్చాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శల వర్షం కురిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్ల తీరు నిరాశకు గురిచేసిందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తన రిథమ్‌ను కోల్పోయాడు. చాలా అదనపు పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం 15 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదు. ఈ స్థాయిలో ఆడుతున్నప్పుడు బౌలర్లు నో బాల్స్‌ను నియంత్రించగలగాలి.
నో బాల్స్ వేయడం క్షమించరాని నేరం. ప్రొఫెషనల్ క్రికెటర్లు ఎప్పుడూ నో బాల్స్ వేయకూడదు. కొన్ని సార్లు నో బాల్‌లు, వైడ్‌లే గెలుపోటములు నిర్ణయిస్తాయి. మన వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించి వైడ్‌లు వేస్తున్నారు. కొంచెం లైన్ లెంగ్త్‌పై దృష్టి పెట్టాలి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: Jasprit Bumrah: 3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు.. ఆ ఒక్కడిపైనే భారం!
Comments
Please login to add a commentAdd a comment