టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్‌లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు.
శుక్రవారం లండన్‌లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్‌లో జకోవిచ్, సినర్ మ్యాచ్‌ను గిల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. మరో విశేషమేమిటంటే గిల్ పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు అతడి భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక వీరితో పాటు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, నెదర్లాండ్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిటన్ యాక్టర్ బెనెడిక్ట్ కంబర్‌బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్‌లు కూడా రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్‌ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవలే సిల్వర్‌స్టోన్ సర్క్యూట్ వేదికగా జరిగిన బ్రిటీష్ గ్రాండ్‌ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 0-3తో ఇంగ్లండ్‌కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివరి మ్యాచ్‌ను సౌతాంప్టన్ వేదికగా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలుకానుంది.
వన్డే సిరీస్‌కు గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జట్టు పరిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వన్డే సిరీస్‌ను ఉపయోగించుకుంటామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుందని గిల్ వెల్లడించాడు.
Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg
— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026


