రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గిల్ స‌హ‌చ‌రుడు | Gill Teammate Gitansh Khera Announce Retirement-Domestic Cricket | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన గిల్ స‌హ‌చ‌రుడు

Aug 21 2026 1:21 PM | Updated on Aug 21 2026 1:36 PM

Gill Teammate Gitansh Khera Announce Retirement-Domestic Cricket

Photo Credit: Twitter

టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స‌హ‌చ‌రుడు, పంజాబ్ జ‌ట్టు సీనియ‌ర్‌ వికెట్ కీప‌ర్‌  గితాన్ష్ ఖేరా దేశ‌వాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2017లో గిల్ పంజాబ్ త‌ర‌ఫున‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన స‌మ‌యంలో ఆ జ‌ట్టు వికెట్  కీప‌ర్‌గా గితాన్ష్ ఖేరానే ఉన్నాడు. 14 ఏళ్ల పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడిన‌ప్ప‌టికీ గితాన్ష్ ఖేరాకు జాతీయ జ‌ట్టుకు ఆడే అవ‌కాశం రాలేదు. కాగా గితాన్ష్ ఖేరా గురువారం సాయంత్రం త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా దేశ‌వాళీ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు భావోద్వేగ ప్ర‌క‌ట‌న చేశాడు. 

"అంద‌రిలాగే క్రికెట్లో నేను జాతీయ జ‌ట్టుకు ఆడాల‌ని క‌ల‌లు క‌న్నా. కానీ మ‌న జీవితం ప్లాన్ చేసిన‌ట్లుగా ఎప్పుడు ఉండ‌దు. అంత‌ర్జాతీయంగా దేశానికి ఆడాల‌న్న క‌ల నెరవేర‌క‌పోయినప్ప‌టికీ, డొమెస్టిక్ క్రికెట్ ద్వారా ఎంతో మంది స్నేహితుల‌ను, లెక్క‌లేన‌న్ని జ్ఞాప‌కాలను సంపాదించుకున్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా. దేశ‌వాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌కు వీడ్కోలు ప‌లుకుతున్న త‌రుణంలో ఆట‌పై నా ప్రేమ మాత్రం మునుపెన్న‌డూ లేనంత బ‌లంగా ఉంది" అని రాసుకొచ్చాడు.

2004లో అండ‌ర్‌-15 విభాగంలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన గితాన్ష్ ఖేరా రెండు ద‌శాబ్ధాల్లో యువ‌రాజ్ సింగ్‌, హ‌ర్భ‌జ‌న్ సింగ్‌తో పాటు శుబ్‌మ‌న్ గిల్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌తో క‌లిసి ఆడ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నాడు. ఇక పంజాబ్ జ‌ట్టు త‌ర‌ఫున అన్ని ఫార్మాట్లు క‌లిపి 100కు పైగా సీనియ‌ర్ మ్యాచ్‌లాడే అవ‌కాశం నాకు ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపాడు.


Photo Credit: Instagram

జూనియ‌ర్ క్రికెట‌ర్‌గా కెరీర్ ఆరంభించిన గితాన్ష్ ఖేరా 2010లో పంజాబ్ సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడాడు. త‌న‌కెరీర్‌లో 56 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన గితాన్ష్ 34 స‌గ‌టుతో 2,515 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచ‌రీలు, 15 హాఫ్ సెంచ‌రీలున్నాయి. ఇక వికెట్ కీప‌ర్‌గా 165 డిస్మిస‌ల్స్ చేశాడు. 

ఇక లిస్ట్‌-ఏ క్రికెట్‌లో 40 మ్యాచ్‌లాడి 44 స‌గ‌టుతో 1,017 ప‌రుగులు సాధించాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, మూడు ఫిఫ్టీలున్నాయి. ఇక 11 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన గితాన్ష్ 96 ప‌రుగులు చేశాడు. ఇక వైట్‌బాల్ క్రికెట్‌లో కీప‌ర్‌గా 81 డిస్మిస‌ల్స్ చేశాడు. గితాన్ష్ చివ‌రిసారిగా జ‌న‌వ‌రి 2024లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

35 ఏళ్ల వ‌య‌సున్న గితాన్ష్‌ ఖేరాకు రిటైర్మెంట్ త‌ర్వాత చాలా మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతానికి, అతను తన భవిష్యత్తు గురించి అధికారికంగా మాట్లాడక‌పోయిన‌ప్ప‌టికీ, క్రికెట్‌లో సంబంధాలు కొన‌సాగించాల‌నుకుంటే కామెంటేట‌ర్‌గా పనిచేయడం, అంపైర్ లేదా కోచ్‌గా మారడం వంటి అవ‌కాశాలున్నాయి.

Read: ‘తులసి వనంలో గంజాయి మొక్క’.. పోలికలు అవసరమా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement