Photo Credit : Twitter
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లినే గొప్ప అని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ పోలిక చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సచిన్, కోహ్లిలను ఒకరితో ఒకరిని పోల్చలేమని, ఎవరికి వారే గొప్ప అని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ఏబీ డివిలియర్స్ పోలికను తీవ్రంగా ఖండించాడు. డివిలియర్స్ తులసి వనంలో గంజాయి మొక్క లాంటోడని, ఇద్దరు గొప్ప క్రికెటర్ల మధ్య పోలికలు చెప్పి అనవసర చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఘాటుగా విమర్శించాడు.
సచిన్ ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని, భారత్ క్రికెట్‌లో అతడికి ప్రత్యేక స్థానం ఉందని దొడ్డ గణేశ్ గుర్తు చేశాడు. అందుకే తన ‘ఎక్స్’ వేదికగా పాస్ ఆన్ ది వీడ్ (గంజాయి అందించకు బ్రదర్) అని రాసుకొచ్చాడు. సచిన్, కోహ్లిల మధ్య వింత పోలికను తీసుకొచ్చి చిచ్చురేపే ప్రయత్నం చేసినందుకే ఇలాంటి కామెంట్ పెట్టినట్లు గణేశ్ వెల్లడించాడు.
Pass on the weed, brother. https://t.co/3XOy6o6x9t
— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) August 20, 2026
ఇద్దరు ఇద్దరే..
ఇక సచిన్ టెండూల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ చర్చకు ముగింపు ఉండదు. టెండూల్కర్ సుదీర్ఘ కెరీర్, రికార్డు స్థాయిలో సాధించిన 15921 టెస్ట్ పరుగులు, 51 సెంచరీలు అతనికి సాటిలేని గణాంక వారసత్వాన్ని అందించాయి. మరోవైపు, భారత టెస్ట్ సంస్కృతిపై, విదేశీ ప్రదర్శనలపై కోహ్లీ చూపిన ప్రభావం అతడిని దేశంలోని అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకడిగా నిలబెట్టింది.
భారత బ్యాటర్లు విదేశాల్లో కూడా ఆధిపత్యం చెలాయించగలరని టెండూల్కర్ ఎప్పుడో నిరూపిస్తే.. కోహ్లీ దానిని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ ఇద్దరు బ్యాటర్లు తమ కఠోర శ్రమ, పట్టుదలతో గొప్ప పేరును పొందారు. వీరిద్దరిని ఒకరితో ఒకరు పోల్చడం తగదు.
సచిన్ విదేశాల్లో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ మొత్తంగా 8705 పరుగులు రాబట్టాడు. ఇక కోహ్లి 4774 పరుగులు చేశాడు. అదే విధంగా SENA దేశాల్లో సచిన్ టెండుల్కర్ 63 టెస్టులు ఆడి సగటు 5387 పరుగులు సాధించాడు. ఇందులో 17 శతకాలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక కోహ్లి SENA దేశాల్లో 46 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3661 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 14 ఫిఫ్టీలు ఉన్నాయి.
అయితే సచిన్ కెప్టెన్సీలో భారత్ పెద్దగా విజయాలు అందుకోలేదు. కానీ కోహ్లి కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ దశకు చేరుకుంది. ముఖ్యంగా విదేశాల్లో మంచి విజయాలు నమోదు చేసింది.


