కోల్‌కతా: సమష్టి ప్రదర్శన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందించింది. ముందుగా పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన జట్టు ఆ తర్వాత బలమైన భాగస్వామ్యాలతో లక్ష్యాన్ని ఛేదించింది. గతి తప్పిన బౌలింగ్, పేలవ ఫీల్డింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది.
ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రహా్మనుల్లా గుర్బాజ్ (39 బంతుల్లో 81; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగాడు. అనంతరం టైటాన్స్ 17.5 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 180 పరుగులు చేసి గెలిచింది. విజయ్ శంకర్ (24 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), శుబ్‌మన్ గిల్ (35 బంతుల్లో 49; 8 ఫోర్లు) కీలక పాత్ర పోషించారు. 2 కీలక వికెట్లు తీసిన జోష్ లిటిల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సిక్సర పిడుగల్లే గుర్బాజ్...
జగదీశన్ (19; 4 ఫోర్లు) స్పీడ్‌కు షమీ బ్రేకులేసినా...అఫ్గనిస్తాన్ బ్యాటర్ గుర్బాజ్ మేటి బౌలర్లయిన షమీ, పాండ్యా, రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్లతో శివమెత్తాడు. జట్టు పవర్‌ప్లేలో 61/2 స్కోరు చేయగా... గుర్బాజ్ ఫిఫ్టీ 27 బంతుల్లో పూర్తయ్యింది. వెంకటేశ్ అయ్యర్ (11), నితీశ్ రాణా (4)లు విఫలమైనా... గుర్బాజ్ ఏ బౌలర్‌ను విడిచిపెట్టకుండా భారీ సిక్సర్లతో చెలరేగిపోవడంతో రన్‌రేట్ ఆద్యంతం దూసుకుపోయింది. 16వ ఓవర్లో గుర్బాజ్‌కు నూర్ అహ్మద్ పెవిలియన్ దారి చూపితే... తర్వాత రసెల్ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచాడు.
గిల్ వేగం... విజయ్ శరవేగం...
ఛేదనలో అవసరమైన ధాటిని శుబ్‌మన్ గిల్ కనబరిచాడు. సాహా (10) నుంచి సహకారం తక్కువైనా, స్కోరుబోర్డును గిల్ చూడచక్కని బౌండరీలతో పరుగెత్తించాడు. హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు సాధించగా...2 పరుగుల వ్యవధిలో పాండ్యా, గిల్ నిష్క్రమించారు. ఈ దశలో 52 బంతుల్లో 87 పరుగుల సమీకరణం క్లిష్టమనిపించింది.
అయితే ఓవైపు మిల్లర్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరోవైపు విజయ్ శంకర్ సిక్సర్లతో 13 బంతులు మిగిలుండగానే గుజరాత్ శరవేగంగా లక్ష్యాన్ని అధిగమించింది. చెత్త ఫీల్డింగ్‌తో బౌండరీలు రావడం, కీలకమైన దశలో మిల్లర్ సులువైన క్యాచ్‌ను సుయాశ్ నేలపాలు చేయడం గుజరాత్‌కు కలిసొచ్చింది.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జగదీశన్ (ఎల్బీ) (బి) షమీ 19; గుర్బాజ్ (సి) రషీద్ (బి) నూర్ అహ్మద్ 81; శార్దుల్ (సి) మోహిత్ (బి) షమీ 0; వెంకటేశ్ (ఎల్బీ) (బి) జోష్ 11; రాణా (సి) తెవాటియా (బి) జోష్ 4; రింకూ (సి) జోష్ (బి) నూర్ అహ్మద్ 19; రసెల్ (సి) తెవాటియా (బి) షమీ 34; వీస్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–23, 2–47, 3–84, 4–88, 5–135, 6–156, 7–179. బౌలింగ్: షమీ 4–0–33–3, హార్దిక్ 3–0–34–0, రషీద్ 4–0–54–0, జోష్ 4–0–25–2, నూర్ అహ్మద్ 4–0–21–2, మోహిత్ 1–0–12–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి)హర్షిత్ (బి) రసెల్ 10; గిల్ (సి) రసెల్ (బి) నరైన్ 49; హార్దిక్ (ఎల్బీ) హర్షిత్ 26; శంకర్ నాటౌట్ 51; మిల్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.5 ఓవర్లలో 3 వికెట్లకు) 180.
వికెట్ల పతనం: 1–41, 2–91, 3–93.
బౌలింగ్: హర్షిత్ 3–0–25–1, రసెల్ 3–0–29–1, వరుణ్ 4–0–42–0, సుయాశ్ 4–0–37–0, నరైన్ 3–0–24–1, నితీశ్ రాణా 0.5–0–14–0.
Comments
Please login to add a commentAdd a comment