
Harbhajan Singh Emotional Comments: ‘‘గత కొంతకాలంగా నేను యాక్టివ్ క్రికెట్ ఆడట్లేదు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉన్న ఒప్పందం, అనుబంధంతో ఇన్నాళ్లు ఆటలో కొనసాగాను. దేనికైనా సమయమే సమాధానం. ఇప్పుడు కూడా నా నిర్ణయానికి సమయం వచ్చింది. మానసికంగా నేనెప్పుడో రిటైరయ్యాను. ఇప్పుడు పూర్తిగా వీడ్కోలు పలికి వ్యక్తిగత, కుటుంబ జీవితంపై దృష్టి పెడతాను. నేను ఐపీఎల్‌లో ముంబై, చెన్నై, కోల్‌కతా జట్లకు ఆడాను. కౌంటీల్లో సర్రే,, ఎస్సెక్స్‌లకు ప్రాతినిధ్యం వహించాను.
అంకితభావంతో, నిబద్ధతతో ఆయా జట్లకు సేవలందించాను. మొత్తం కెరీర్‌లో నేను తీసిన హ్యాట్రిక్ వికెట్లను ఎన్నటికీ మరచిపోలేను. భారత్ సాధించిన 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లో భాగమవడం అన్నింటికన్నా అత్యుత్తమం. ఇంతటి విజయవంతమైన క్రికెట్ ప్రయాణానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా కలల్ని సాకారం చేసుకునేందుకు నా తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారు. గడ్డు పరిస్థితుల్లో నా భార్య గీత ఇచ్చిన అండ దండలు వెలకట్టలేనివి’’ అంటూ హర్భజన్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు.
రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా తన వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు తనకు అండగా నిలిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా అన్ని రకాల ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు భజ్జీ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. అందరు క్రికెటర్లలాగే తాను కూడా టీమిండియా జెర్సీతోనే క్రికెట్ వీడ్కోలు పలకాలని భావించినా.. విధిరాత మరోలా ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. 1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భజ్జీ... 2016లో ఢాకాలో యూఏఈతో చివరిసారిగా టీమిండియా తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడాడు.
గర్వంగా ఉంది మై లవ్:
ఈ సందర్భంగా భజ్జీ భార్య, బాలీవుడ్ నటి గీతా బస్రా సైతం.. ‘‘ఈ క్షణం కోసం నువ్వు ఎంతగా ఎదురుచూశావో నాకు తెలుసు.. మానసికంగా నువ్వు ఎప్పుడో రిటైర్ అయ్యావు. ఇప్పుడు అధికారికంగా... నువ్వు సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. నువ్వు అంకితభావంతో ఆడావు. మన జీవితంలో రెండో భాగం మొదలుకాబోతోంది. మంచికాలం ముందుంది మై లవ్’’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. కాగా హర్భజన్, గీత 2015లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
చదవండి: భజ్జీ 23 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఘనతలు
Comments
Please login to add a commentAdd a comment