ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారీ జంప్ కొట్టాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం హార్దిక్ ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో లంక కెప్టెన్ వనిందు హసరంగ మొదటి స్థానంలో ఉండగా.. ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు.
హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉండగా.. నబీ ఖాతాలో 214 పాయింట్లు ఉన్నాయి. వరల్డ్‌కప్ ప్రదర్శనల ఆధారంగా తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో చాలా మంది ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. హసరంగ ఒక స్థానాన్ని, నబీ రెండు స్థానాలను, మార్క్రమ్ రెండు స్థానాలను (8వ ర్యాంక్), మ్యాక్స్‌వెల్ మూడు స్థానాలను (15వ ర్యాంక్), రసెల్ ఆరు స్థానాలను (16వ ర్యాంక్) మెరుగుపర్చుకున్నారు.
టాప్-20 భారత్ నుంచి హార్దిక్‌తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు. అక్షర్ 130 రేటింగ్ పాయింట్లతో 19వ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్ అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడు రోస్టన్ ఛేజ్. ఈ విండీస్ ఆల్‌రౌండర్ ఏకంగా 17 స్థానాలు మెరుగుపర్చుకుని 12వ స్థానానికి చేరుకున్నాడు.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‌లో కొనసాగుతుండగా.. రషీద్ ఖాన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకాడు. హాజిల్‌వుడ్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి.. ఆడమ్ జంపా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి.. అక్షర్ పటేల్ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి ఎగబాకారు.
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఈ వారం అందరి కంటే ఎక్కువ లబ్ది పొందింది బుమ్రా, కుల్దీప్ యాదవ్. బుమ్రా ఏకంగా 44 స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి ఎగబాకగా.. కుల్దీప్ 20 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి జంప్ కొట్టాడు. అలాగే కేశవ్ మహారాజ్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 14 స్థానానికి ఎగబాకాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 17, రవి బిష్ణోయ్ 19 స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment