Team India Captain: వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఐరిష్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆగష్టు 18- 23 వరకు ఈ మేరకు సిరీస్ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది.
ఐర్లాండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ రానున్నట్లు సమాచారం. విరాట్ కోహ్లి సారథిగా వైదొలిగిన తర్వాత రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ కాగా.. అతడి గైర్హాజరీలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, శిఖర్ ధావన్ తదితరులు వివిధ సందర్భాల్లో కెప్టెన్లుగా వ్యవహరించారు.
మొన్న రుతురాజ్ గైక్వాడ్
ఇక ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో చైనాకు వెళ్లనున్న భారత ద్వితీయ శ్రేణి పురుషుల జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ నాయకుడిగా ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఆసియా కప్-2023 వన్డే టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
హార్దిక్‌కు విశ్రాంతి
ఈ నేపథ్యంలో ఐర్లాండ్ టూర్‌లో స్టార్ ఆల్‌రౌండర్, భవిష్యత్ కెప్టెన్‌గా ఎదిగిన తాత్కాలిక సారథి హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో హార్దిక్‌కు డిప్యూటీగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘‘ఇప్పటి వరకైతే ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత హార్దిక్ నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఫ్లోరిడా నుంచి డబ్లిన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆసియా కప్, ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్.. ప్రస్తుతం ఇవే ప్రాధాన్యతాంశాలు.
పనిభారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వరల్డ్‌కప్‌లో అతడు రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉంటాన్న సంగతి మర్చిపోకూడదు. కాబట్టి అతడికి కావాల్సినంత విశ్రాంతి అవసరం’’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐతో వ్యాఖ్యానించాయి.
కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌లో టీమిండియాను సూర్య ముందుండి నడిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్‌కు స్కై ఓ మ్యాచ్‌లో సారథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఎంత మంది కెప్టెన్లురా నాయనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 29 ఏళ్ల పాండ్యా ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యుడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
విండీస్ పర్యటన ముగియగానే
ఇక ఐర్లాండ్ పర్యటనలో హార్దిక్‌తో పాటు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు కూడా రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఆ తర్వాత జూలై 27- ఆగష్టు 1 వరకు వన్డే, ఆగష్టు 3- ఆగష్టు 13 వరకు టీ20 సిరీస్‌లలో తలపడనుంది. ఆ తర్వాత ఐదు రోజుల్లో ఐర్లాండ్‌కు చేరుకోనుంది.
చదవండి: 'నమ్మలేకపోతున్నా విరాట్ సర్.. ఆమె మిమ్మల్ని చూడటానికి వస్తోంది'
Ind vs WI: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా వాళ్లను పిలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment