మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్‌ మాత్రం: సూర్య | We Have Lot Of Captains On Ground Hardik Part of leadership Group: Suryakumar | Sakshi
Sakshi News home page

మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. ఇక హార్దిక్‌ మాత్రం: సూర్య

Published Wed, Jan 22 2025 12:39 PM | Last Updated on Wed, Jan 22 2025 1:04 PM

We Have Lot Of Captains On Ground Hardik Part of leadership Group: Suryakumar

సౌతాఫ్రికా గడ్డపై విజయం తర్వాత సూర్యకుమార్‌ సేన స్వదేశంలో మరో పొట్టి ఫార్మాట్‌ పోరుకు సిద్ధమైంది. ఇంగ్లండ్‌(India Vs England)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం తొలి టీ20 ఆడనుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించేందుకు సై అంటున్నాయి.

ఇక టీ20 ప్రపంచకప్‌-2024(T20 World Cup 2024)లో సెమీస్‌లో తలపడ్డ ఇండియా- ఇంగ్లండ్‌ ముఖాముఖి పోటీపడటం ఇదే తొలిసారి. నాడు టీమిండియా చేతిలో చిత్తైన ఇంగ్లిష్‌ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుండగా.. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భారత్‌ పట్టుదలగా ఉంది. దీంతో ఈ పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌-2024 సమయంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యాకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో అదరగొట్టిన ఈ ఆల్‌రౌండర్‌ను కాదని.. సూర్యకుమార్‌ యాదవ్‌ను రోహిత్‌ శర్మ(Rohit Sharma) వారసుడిగా ప్రకటించింది. 

సారథిగా సూపర్‌ హిట్‌
ఈ క్రమంలో గతేడాది శ్రీలంక పర్యటన సందర్భంగా టీ20 పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సూర్య.. 3-0తో క్లీన్‌స్వీన్‌ విజయంతో ప్రస్థానం ఆరంభించాడు. అనంతరం సొంతగడ్డపై బంగ్లాదేశ్‌పై కూడా సూర్య ఇదే ఫలితం పునరావృతం చేయగలిగాడు. 

ఆ తర్వాత సౌతాఫ్రికా పర్యటనలో 3-1తో టీమిండియాను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల నేపథ్యంలో కొత్త వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. 

ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాతో సూర్య అనుబంధం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశంలో భాగంగా ఈ ప్రస్తావన రాగా సూర్య హుందాగా స్పందించాడు.

మా జట్టులో చాలా మంది కెప్టెన్లు ఉన్నారు.. హార్దిక్‌ మాత్రం
‘‘హార్దిక్‌ పాండ్యాతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా నాయకత్వ బృందంలో అతడు ఎల్లప్పుడూ కీలక భాగమే. భారత జట్టును ఎలా నడిపించాలో మాకందరికీ బాగా తెలుసు. 

మైదానంలోకి దిగాక జట్టు కోసం అందరం చర్చించే నిర్ణయం తీసుకుంటాం. సరిగ్గా చెప్పాలంటే మా జట్టులో ఒకరికంటే ఎక్కువ మంది కెప్టెన్లు ఉన్నారు. మైదానంలో అవసరమైనపుడు సూచనలు, సలహాలు ఇస్తారు.

ఇక హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌తో కూడా నేను గతంలో కలిసి పని చేశాను. ఆయన ఆటగాళ్లకు మంచి స్వేచ్ఛనిస్తారు. కోచ్‌ పర్యవేక్షణలో ప్రస్తుతం మా జట్టు సరైన దిశలోనే వెళుతోంది. వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి మరో ప్లేయర్‌ గురించి ఆలోచన లేదు.

ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు
టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. ఆలోగా దాదాపు ఒకే జట్టుతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడి టీమ్‌ను సిద్ధం చేయడం ముఖ్యం’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూనే.. తమ భవిష్యత్తు ప్రణాళిక గురించి కూడా వివరించాడు.

నేను బాగా ఆడలేదు కాబట్టే
ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా సూర్య ఈ సందర్భంగా స్పందించాడు. వన్డే ఫార్మాట్లో తన ప్రదర్శన బాగా లేనందువల్లే ఎంపిక కాలేదని నిజాయితీగా ఒప్పుకొన్నాడు. ఏదేమైనా వన్డేల్లో బాగా ఆడలేకపోవడమే తనను తీవ్ర నిరాశకు గురి చేస్తోందని తెలిపాడు.

చదవండి: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ బెస్ట్‌ టీమ్‌.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌! నితీశ్‌కు చోటు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement