భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త లుక్‌తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే ఈ ఛాంపియన్ కెప్టెన్ కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ఫ్యూజులు ఎగురగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.
కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని, తెలుగమ్మాయిలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడంతో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్‌లో హర్మన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరెట్‌గా మారిన హర్మన్ సేన, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హేలీ మాథ్యూస్ (4-2-25-3), మేలీ కెర్ (4-0-18-2) అద్భుత ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఛేదనలో నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్), హర్మన్ (37) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది.
లీగ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన హర్మన్.. సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 40.41 సగటున, 135.10 స్ట్రయిక్ రేట్‌తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment