ఆఖరి ఓవర్లో అలా చేస్తారా? టీమిండియా కెప్టెన్‌దే తప్పు? | Harmanpreet Kaurs Final Over Antics Stuns Fans After Indias Defeat To AUS | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఆఖరి ఓవర్లో అలా చేస్తారా? టీమిండియా కెప్టెన్‌దే తప్పు?

Published Mon, Oct 14 2024 1:05 PM | Last Updated on Mon, Oct 14 2024 2:27 PM

Harmanpreet Kaurs Final Over Antics Stuns Fans After Indias Defeat To AUS

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 9 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓటమి చ‌విచూసింది. ఈ ఓట‌మితో త‌మ సెమీస్ అవ‌కాశాల‌ను భార‌త్ సంక్లిష్టం చేసుకుంది. ఇప్పుడు సెమీస్ ఆశ‌ల‌న్నీ పాకిస్తాన్‌-న్యూజిలాండ్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌పై పాక్ విజ‌యం సాధిస్తే మెరుగైన ర‌న్‌రేట్ ప‌రంగా టీమిండియా సెమీస్‌కు అర్హ‌త సాధిస్తుంది. 

ఒక‌వేళ పాక్ ఓటమి చెందితే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ క‌థ ముగిసిన‌ట్టే. ఇక ఆసీస్‌తో మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. 152 ప‌రుగుల ఓ మోస్తారు ల‌క్ష్యాన్ని చేధించ‌డంలో భార‌త్ విఫ‌ల‌మైంది. ల‌క్ష్య చేధ‌న‌లో మ‌న అమ్మాయిలు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 142 ప‌రుగుల‌కే పరిమితమయ్యారు. 

భార‌త కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆఖ‌రి వరకు పోరాడిన‌ప్ప‌ట‌కి జ‌ట్టును విజ‌య‌తీరాల‌ను చేర్చ‌లేక‌పోయింది. అయితే 54 ప‌రుగుల‌తో హ‌ర్మ‌న్  టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన‌ప్ప‌ట‌కి అభిమానుల నుంచి విమ‌ర్శ‌ల ఎదుర్కొంటుంది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో కౌర్ బ్యాటింగ్ విధానాన్ని చాలా మంది త‌ప్పుబడుతున్నారు.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో భార‌త విజ‌యానికి 14 పరుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే క్రీజులో హ‌ర్మ‌న్ ప్రీత్ ఉండడంతో మ్యాచ్‌పై భార‌త అభిమానులు ఇంకా ఆశ‌లు వ‌దులుకోలేదు. ఆసీస్ కెప్టెన్ మెక్‌గ్ర‌త్ చివ‌రి ఓవ‌ర్ వేసే బాధ్య‌త‌ను పేస‌ర్ అన్నాబెల్ సదర్లాండ్‌కు అప్ప‌గించింది.

ఈ క్ర‌మంలో తొలి బంతిని ఎదుర్కొన్న కౌర్ సింగిల్ తీసి పూజాకు స్ట్రైక్ ఇచ్చింది. రెండో బంతికి పూజా క్లీన్ బౌల్డ్ అయింది. మూడో బంతికి అరుంధతి రెడ్డి రనౌట్‌గా వెనుదిరిగింది. నాల్గవ డెలివరీలో హర్మన్‌ప్రీత్ స్ట్రైక్‌కి తిరిగి వచ్చింది. కానీ ఆమె మళ్లీ సింగిల్ కోసం వెళ్లి శ్రేయాంక పాటిల్‌ను స్ట్రైక్‌లోకి తీసుకొచ్చింది. 

చివ‌రి రెండు బంతుల్లో 12 ప‌రుగులు చేయాల్సిన స‌మయంలో ఐదో బంతిని అన్నాబెల్ వైడ్ డెలివ‌రీగా సంధించింది. వైడ్‌ బంతికి ప‌రుగుకు ప్ర‌య‌త్నించి శ్రేయాంక పాటిల్ ర‌నౌట్ అయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన రాధా యాద‌వ్ ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరింది. 

చివ‌రి బంతికి రేణుకా సింగ్ సింగిల్ తీసింది. దీంతో ఆఖ‌రి ఓవ‌ర్‌లో కేవ‌లం భార‌త్ కేవ‌లం 3 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఓట‌మి పాలైంది. ఈ క్ర‌మంలో హ‌ర్మ‌న్ స్ట్రైక్‌ను త‌న వ‌ద్ద ఉంచుకోక‌పోవ‌డం స‌ర్వాత విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. జ‌ట్టుకు విజ‌యానికి 14 పరుగులు అవ‌స‌ర‌మైన‌ప్ప‌డు టెయిలాండ‌ర్ల‌కు స్ట్రైక్ ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement