ప్రేమించే వ్యక్తి కావాలి కదా: సానియా మీర్జా వ్యాఖ్యలు వైరల్‌ | Have To Find Love: Sania Mirza Comments Viral After Divorce From Shoaib Malik | Sakshi
Sakshi News home page

Sania Mirza: ప్రేమించే వ్యక్తిని కనుగొనాలి: సానియా వ్యాఖ్యలు వైరల్‌

Published Tue, Jun 4 2024 3:58 PM | Last Updated on Tue, Jun 4 2024 4:09 PM

Have To Find Love: Sania Mirza Comments Viral After Divorce From Shoaib Malik

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం ప్రేమించే వ్యక్తిని వెతుక్కోవాల్సిన స్థితిలో ఉన్నానని పేర్కొన్నారు. కాగా సానియా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైన విషయం తెలిసిందే.

ఎంతగానో ప్రేమించి.. ఆటంకాలను ఎదురించి పెళ్లాడిన పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఆమెను మోసం చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య పొరపొచ్చాలు తలెత్తాయని విడాకులు తీసుకుంటారనే ప్రచారం జరిగింది.

అయితే, వీరిద్దరూ ఈ విషయంపై నేరుగా నోరు విప్పలేదు. కానీ.. షోయబ్‌ మాలిక్‌ ఏకంగా నటి సనా జావెద్‌ను పెళ్లాడి.. ఫొటోలతో షాకిచ్చాడు. దీంతో సానియా- షోయబ్‌ల బంధం ముక్కలైందని అందరికీ తెలిసిపోయింది.

ఈ క్రమంలో సానియా మీర్జా కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. సానియా తనంతట తానుగా షోయబ్‌ నుంచి విడాకులు తీసుకుందని స్పష్టం చేసింది. ఏదేమైనా అతడి జీవితం బాగుండాలని సానియా ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత సానియా మీర్జా తన కుమారుడు ఇజహాన్‌తో కలిసి దుబాయ్‌లో ఎక్కువగా గడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తాజాగా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

కాగా బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ గతంలో ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘సానియా బయోపిక్‌ తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అన్నీ కుదిరితే నేనే ఆ సినిమా ప్రొడ్యూస్‌ చేస్తాను. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే తనకు జంట(ప్రియుడి)గా కూడా నటిస్తాను’’ అని పేర్కొన్నాడు.

ఈ క్రమంలో వ్యాఖ్యాత కపిల్‌ తాజాగా షారుక్‌ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇందుకు బదులుగా.. ‘‘ముందుగా నేను నా ప్రేమను కనుగొనాలి(ప్రేమించే వ్యక్తి) కదా’’ అని సానియా మీర్జా సమాధానమిచ్చారు.

ఈ నేపథ్యంలో సానియా జీవితంతో రెండో అవకాశం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని.. అదే నిజమైతే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని ఆమె ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. ప్రతి ఒక్క స్త్రీకి తన జీవితాన్ని అందంగా మలచుకునే అవకాశం ఉందని.. మోసగాళ్ల కోసం తమ లైఫ్‌ను పణంగా పెట్టాల్సిన పనిలేదని కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement