సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్‌మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్‌మోహన్ రావు ఘనంగా సత్కరించారు.
ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్‌ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.
భవిష్యత్‌లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్‌మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్‌ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది.
అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్‌మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు
శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ జట్టుకు నాలుగో విజయం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్‌సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్‌రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.
12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్‌లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో రియల్ కశ్మీర్ ఎఫ్‌సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది.
సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్‌లుగా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment