ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆటంటే తనకెంతో ఇష్టమని.. టీ20లలో ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మంచి భవిష్యత్తు ఉందన్నాడు. పొట్టి ఫార్మాట్లో టీమిండియా భవిష్య కెప్టెన్‌గా తాను తిలక్‌నే ఎంచుకుంటానని బ్రాడ్ హాగ్ తెలిపాడు.
ఐపీఎల్‌లో సత్తా చాటి
కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ముంబై ఇండియన్స్(Mumbai Indians) తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే అద్భుతాలు చేసిన అతడు టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023 ఆగష్టులో వెస్టిండీస్(West Indies Tour)తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
సౌతాఫ్రికా గడ్డపై వరుస సెంచరీలు
అదే పర్యటనలో వన్డేల్లోనూ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మొత్తంగా 21 టీ20లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 635 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా రెండు శతకాలు ఉండటం విశేషం. అంతేకాదు.. ఈ రెండూ కూడా సౌతాఫ్రికా గడ్డపై.. అదీ వరుస మ్యాచ్‌లలో సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనం.
ఇక ఇప్పటికి నాలుగు వన్డేలు పూర్తి చేసుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ 68 పరుగులు చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల.. రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో బ్యాటర్‌గా, సారథిగా సత్తా చాటి ఫైనల్‌కు చేర్చాడు.
ఇక తిలక్ వర్మ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నాడు. ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 16 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.
టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తిలక్ వర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అత్యంత ఇష్టమైన యువ క్రికెటర్ తిలక్ వర్మ. టీ20 ఫార్మాట్లో అతడు టీమిండియాకు కెప్టెన్ కావడం ఖాయం. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ బ్రెయిన్ సూపర్. అందుకే భవిష్య కెప్టెన్‌గా ఎదుగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు.
అభిషేక్ భేష్
అదే విధంగా.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అదరగొట్టిన అభిషేక్ శర్మను కూడా బ్రాడ్ హాగ్ ఈ సందర్భంగా అభినందించాడు. ‘‘కొన్నిసార్లు అతడు విఫలమైన మాట వాస్తవం. అయితే, కోచ్‌తో పాటు కెప్టెన్ మద్దతు ఉండటం అతడికి సానుకూలాంశం. ఎందుకంటే.. టీ20 క్రికెట్‌లో టాపార్డర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాలని ఏ జట్టైనా కోరుకుంటుంది.
ఓపెనింగ్ బ్యాటర్‌కు మేనేజ్‌మెంట్ కాస్త స్వేచ్ఛనిస్తుంది. పవర్ ప్లేలో పరుగులు రాబట్టి మంచి పునాది వేస్తే.. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనర్. అతడు ఈరోజు అద్భుతంగా ఆడాడు. ఇలాగే మున్ముందూ కొనసాగాలి’’ అని బ్రాడ్ హాగ్ ఆకాంక్షించాడు.
కాగా తొలి టీ20లో ఇంగ్లండ్‌ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 34 బంతుల్లోనే 79 పరుగులతో రాణించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 232.35.
Comments
Please login to add a commentAdd a comment