ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.
ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.
తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.
కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్‌లో వస్తే మరోలా ఉంటుంది.
పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.
తిలక్ వర్మకు లైన్ క్లియర్
అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.
కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది.
సంజూ, తిలక్ ఊచకోత
తొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.
మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.
చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment