టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టాపార్డర్‌లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలుత ధర్మశాలలో అఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.
ఇదిలా ఉంటే.. అఫ్గాన్‌తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.
మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.
క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్‌ను ఓపెనింగ్ చేయించి శుబ్‌మన్ గిల్‌ను వన్‌డౌన్‌కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.
ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్‌గా వెళ్లాలా? లేదంటే వన్‌డౌన్‌లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.
ఏదేమైనా జైస్వాల్‌ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్‌తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.


