వాళ్లు నిర్ణయాలు మార్చుకున్నారు.. హీత్‌ స్ట్రీక్‌ మళ్లీ బతికొచ్చాడు! | Heath Streak's Death Turns Out To Be Rumor, Fans Reacted - Sakshi
Sakshi News home page

వాళ్లు నిర్ణయాలు మార్చుకున్నారు.. హీత్‌ స్ట్రీక్‌ మళ్లీ బతికొచ్చాడు!

Published Wed, Aug 23 2023 12:32 PM | Last Updated on Wed, Aug 23 2023 12:44 PM

Heath Streak News of His Death Turns Out To Be Rumor Fans Reactions - Sakshi

ఒక విషయాన్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకున్న తర్వాతే బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. లేదంటే.. తీవ్ర గందరగోళం తప్పదు. సోషల్‌ మీడియా విస్త్రృతి పెరిగిన తర్వాత నకిలీ వార్తలు లెక్కకు మిక్కిలి ప్రచారమవుతున్నాయి.

దీంతో.. ఒక్కోసారి వదంతులే నిజమనే భ్రమలో చాలా మంది తాము సైతం తెలియకుండానే రూమర్ల వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే, జింబాబ్వే మాజీ పేసర్‌ హెన్రీ ఒలంగ మాత్రం తాను తప్పులో కాలేయడమే గాక.. క్రికెట్‌ అభిమానులను కూడా తప్పుదోవపట్టించాడు. ఫలితంగా నెట్టింట భారీ స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.

జింబాబ్వే దిగ్గజ ఆల్‌రౌండర్‌ హీత్‌ స్ట్రీక్‌ గత రెండేళ్లుగా క్యాన్యర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అతడు మరణించాడంటూ ఒలంగ బుధవారం ట్వీట్‌ చేశాడు. స్ట్రీక్‌ చనిపోయాడనే వార్తను ధ్రువీకరిస్తూ నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు.

ఈ నేపథ్యంలో జింబాబ్వే కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ సైతం.. హీత్‌ స్ట్రీక్‌కు నివాళి అర్పిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో అభిమానులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. 49 ఏళ్లకే స్ట్రీక్‌ లోకాన్ని వీడిపోయాడంటూ సోషల్‌ మీడియాలో నివాళులు అర్పించారు.

అయితే, తాను బతికే ఉన్నానని హీత్‌ స్ట్రీక్‌ తెలిపినట్లు ఒలంగ తాజాగా ట్వీట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన తనతో జరిపిన చాట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశాడు. ఈ క్రమంలో హీత్‌ స్ట్రీక్‌ బతికే ఉన్నాడన్న శుభవార్త అభిమానులకు ఆనందం కలిగించినప్పటికీ.. ఒలంగ చేసిన తప్పిదం వారి ఆగ్రహానికి కారణమైంది.

ఈ క్రమంలో నెట్టింట హీత్‌ స్ట్రీక్‌తో పాటు హెన్రీ ఒలంగ పేర్లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. మీమ్స్‌తో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఒలంగను ఓ ఆటాడేసుకుంటున్నారు. ఇక మరికొంత మంది.. ‘‘2023లో క్రికెట్‌లో పునరాగమనాలు ఇవే.. 

బెన్‌ స్టోక్స్‌, తమీమ్‌ ఇక్బాల్‌ తమ రిటైర్మెంట్లు వెనక్కి తీసుకున్నారు. బుమ్రా గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చాడు. ఇక హీత్‌ స్ట్రీక్‌ అయితే ఏకంగా చావునే జయించాడు’’ అని తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా హీత్‌ స్ట్రీక్‌ బతికే ఉన్నాడన్న వార్తను జింబాబ్వే క్రికెట్‌ కూడా ధ్రువీకరిస్తూ మరో ట్వీట్‌ చేయడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement