
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలాడో వ్యక్తి. లాలాపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో ఈ ఘటన జరిగింది. మృతుడు మల్కాజిగిరికి చెందిన పరమేశ్ యాదవ్ అని పోలీసులు తెలిపారు.
కాగా ప్రైవేట్ ఉద్యోగి పరమేష్ యాదవ్ (39) ప్రతిరోజు బ్యాడ్మింటన్ ఆడటానికి లాలాపేటలోని ప్రొ.జయశంకర్ ఇండోర్ స్టేడియానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అపస్మారకస్థితికి చేరిన అతడినిఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. గుండెపోటుతో పరమేశ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని స్థానిక పోలీసులు తెలిపారు.
కాగా ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో హఠాన్మరణాలు సంభవించడం చూస్తూనే ఉన్నాం. ఆధునిక జీవనశైలి, ఆహారపుటలవాట్ల కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోందని నిపుణులు అంటున్నారు. కార్డియాక్ అరెస్టు అయినపుడు సరైన సమయంలో సీపీఆర్ చేయడం ద్వారా బాధితులను కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
చదవండి: హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్టుల కాలం ఇది! ఆగిపోయే గుండె మీది కాకూడదంటే..