
కరాచీ: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ తనకు రోల్ మోడల్ అని గతంలో స్పష్టం చేసిన పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ.. అతనితో తనను పోల్చవద్దని అంటున్నాడు. రోహిత్ శర్మతో పోలికను తాను అంతగా ఆస్వాదించలేకపోతున్నానన్నాడు. అదే సమయంలో రోహిత్‌తో పోలిక తనకు అసౌకర్యంగా ఉందన్నాడు. ఎవరైనా తనను రోహిత్‌తో పోల్చినప్పుడు దానిని తీసుకోలేకపోతున్నానని హైదర్ అలీ తెలిపాడు. ‘చాలా మందికి పలువురు రోల్ మోడల్స్ ఉంటారు. నాకు రోహిత్ శర్మ రోల్ మోడల్. నేను ప్లేయర్‌గా రోహిత్‌ను ఇష్టపడతా. అతని దూకుడైన ఆట నాకు ఇష్టం. బంతిని రోహిత్ హిట్ చేసే విధానం చాలా ఇష్టం.
అన్ని ఫార్మాట్లలో రోహిత్ ఆడుతున్నాడు. అన్ని ఫార్మాట్లకు సరిపోతాడు. అతనొక టాప్ బ్యాట్స్‌మన్. కానీ ఎవరైనా రోహిత్‌తో నన్ను పోల్చితే అసౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ నాకు అతనితో పోలిక లేదు. రోహిత్ ఇప్పటికే ఎన్నో సాధించాడు. నేను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడగలను. నేను నా ఆటను ఎంజాయ్ చేస్తా. ఫస్ట్‌క్లాస్ సీజన్‌లో నేను కూడా మంచి క్రికెట్ ఆడాను. మా కోచ్ మహ్మద్ వసీం మార్గదర్శకాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మనకు కోచ్‌లు ఇచ్చే ఆత్మవిశ్వాసమే మన ఆటను వేరే స్థాయికి తీసుకెళ్తాయి. మన పూర్తిస్థాయి ప్రదర్శనకు కోచ్‌లే మార్గదర్శకులు’ అని హైదర్ అలీ పేర్కొన్నాడు.