
Shoaib Akhtar On Hardik Pandya Injury: వెన్నెముక గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. గాయానికి ముందు ఓ వెలుగు వెలిగిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు.. శస్త్ర చికిత్స అనంతరం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు.
ఇటీవలి కాలంలో అతని ఫామ్ మరీ దారుణంగా ఉండటంతో జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యా గాయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ చోప్రా ఛానల్‌తో మాట్లాడుతూ.. హార్ధిక్ గాయాన్ని ముందు ఊహించానంటూ వ్యాఖ్యానించాడు. తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడని తెలిపాడు.
2018 ఆసియా కప్ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను కలిశానని, ఆ సమయంలో వాళ్లు మరీ బక్కపలచగా ఉన్నారని, వాళ్లకి వెన్నెముకలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉండేవారని అన్నాడు. అప్పుడే తాను పాండ్యా గాయపడతావని హెచ్చరించానని, తాను చెప్పిన గంటన్నరలోపే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. కాగా, గాయం కారణంగా ఫామ్ కోల్పోయిన హార్ధిక్ టెస్టులకు గుడ్బై చెప్పి, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు మాత్రమే పరిమతమయ్యే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..