న్యూఢిల్లీ: పర్యాటక ఇంగ్లండ్ జట్టు చేతిలో టీమిండియాకు జరిగిన ఘోర పరాభవానికి బాధ్యున్ని చేస్తూ.. భారత జట్టు సారధి విరాట్ కోహ్లీపై ముప్పేట దాడి మొదలైంది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో జట్టు సారధి విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై మాజీ ఆటగాళ్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో(2019/2020లో న్యూజిలాండ్ చేతిలో రెండు టెస్టులు, ఇటీవల ఆసీస్ గడ్డపై తొలి టెస్టు ఓటమి) ఓటమి పాలు కావడంతో అతని కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయంటూ ఇంగ్లండ్ మాజీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరగబోయే రెండో టెస్టులో భారత జట్టు ఓటమి పాలైతే, కెప్టెన్‌గా కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనని పనేసర్ విమర్శించారు. కోహ్లీ గైర్హాజరీలో(గత ఆసీస్ పర్యటనలో) టీమిండియాను అత్యంత సమర్ధవంతంగా ముందుండి నడిపించిన అజింక్య రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించాలన్న డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో ఈ ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కోహ్లీ నిస్సందేహంగా ఆల్ టైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అతని సారధ్యంలో భారత జట్టు దారుణంగా విఫలం కావడానికి కోహ్లీనే నైతిక బాధ్యత వహించాలని పనేసర్ డిమాండ్ చేశాడు. ఓవైపు సహచరుడు రహానే కెప్టెన్‌గా సక్సెస్ అవుతుండటంతో కోహ్లీ ఒత్తిడిలో కూరుకుపోయాడని అతను వ్యాఖ్యానించాడు. తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు బదులు షాదాబ్ నదీమ్‌ను ఎంపిక చేయడాన్ని పనేసర్ తప్పుపట్టాడు.
నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను క్లిష్టం చేసుకోగా, టీమిండియాపై విజయంతో పర్యాటక ఇంగ్లండ్ జట్టు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు మార్గం సుగమమం చేసుకోవడంతో పాటు సొంత గడ్డపై టీమిండియా 14 వరుస విజయాల జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది.
Comments
Please login to add a commentAdd a comment