చెన్నై: కోహ్లీ కెప్టెన్సీపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఓ విలేకరికి టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే చురకలంటించాడు. మీకు కావాల్సిన మసాలా వార్తలు ఇక్కడ దొరకవని స్పష్టం చేశాడు. రేపటి నుంచి ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం మీడియాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ.. జట్టు మొత్తానికి కోహ్లీ కెప్టెన్సీపై పూర్తి నమ్మకం ఉందని, అతనే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని, ఇకనైనా కెప్టెన్సీపై ఉహాగానాలకు చెక్ పెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
తన బ్యాటింగ్ వైఫల్యంపై జింక్స్ మాట్లాడుతూ.. గత వైఫల్యాలను బేరీజు వేసుకొని, రెండో టెస్ట్‌కు అన్ని విధాల సన్నద్దమయ్యానన్నాడు. రేపటి నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లో స్పిన్నర్లు చెలరేగుతారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తొలి టెస్ట్‌లో ఎదురైన పరాభావాన్ని మరిచిపోయి, తదుపరి టెస్ట్‌లో సర్వ శక్తులు ఒడ్డి విజయం కోసం కృషి చేస్తామన్నాడు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రేపు ఉదయం 9:30గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ఇటీవల కాలంలో రహానే మెల్‌బోర్న్ టెస్ట్ సెంచరీ మినహా గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 4, 22, 24, 37, 1, 0 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. కెప్టెన్‌గా రాణించినా, బ్యాట్స్‌మన్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడని మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment