ఐపీఎల్‌ 2020: నెట్‌ రన్‌రేట్‌ టై అయితే.. | If Net Run Rate of Two Teams Is Tied | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2020: నెట్‌ రన్‌రేట్‌ టై అయితే..

Published Mon, Nov 2 2020 5:12 PM | Last Updated on Mon, Nov 2 2020 7:34 PM

If Net Run Rate of Two Teams Is Tied - Sakshi

రాజస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత కేకేఆర్‌(ఫోటో సోర్స్‌: బీసీసీఐ)

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగింపు దశకు వచ్చేసింది. రేపటితో లీగ్‌ దశ ముగియనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మంగళవారం జరుగనున్న చివరి లీగ్‌ మ్యాచ్‌ తర్వాత ప్లేఆఫ్స్‌ బెర్తులపై పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ముంబైపై సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఇప్పటికే ఆరేసి విజయాలతో సీఎస్‌కే, కింగ్స్‌ పంజాబ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లు ఇంటిదారి పట్టగా, ముంబై ఇండియన్స్‌ ఒక్కటే ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అంటే ఇంకా మూడు జట్ల ప్లేఆఫ్‌ బెర్తులు ఖరారు కావాల్సి ఉంది. రేపు జరిగే ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆరెంజ్‌ ఆర్మీ గెలిస్తే మూడో స్థానానికి చేరినా ఆశ్చర్చపోవాల్సి పనిలేదు. ఈ రోజు ఆర్సీబీ-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఓడిన జట్టుకు ఇంకా అవకాశం ఉంటుంది. ఈ రోజు ఓడిన జట్టు, నిన్న రాజస్తాన్‌పై గెలిచిన కేకేఆర్‌ జట్ల మధ్య నాల్గో స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 

ప్రస్తుతం టాప్‌-4లో ఉన్న జట్ల విషయానికొస్తే మూడు జట్ల రన్‌రేట్‌ మైనస్‌లో ఉంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు -0.145 నెట్‌ రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఉండగా,  ఢిల్లీ -0 159గా ఉంది. ఇక నైట్‌రైడర్స్‌ రన్‌రేట్‌ -0.214గా ఉంది. ఆర్సీబీ, ఢిల్లీలతో పోలిస్తే కేకేఆర్‌ నెట్‌ రన్‌రేట్‌ బాలేదు.  దాంతో ఆ జట్టుకు ఉన్న మార్గం ఒక్కటే. అది రేపటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలవకుండా ఉంటేనే కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు వెళుతుంది. అలా కాకుండా సన్‌రైజర్స్‌ గెలిచిన పక్షంలో కేకేఆర్‌ నాల్గో స్థానం కోసం ఆర్సీబీ, ఢిల్లీలతో మాత్రమే పోటీ పడుతుంది. ఎందుకంటే సన్‌రైజర్స్‌ రన్‌రేట్‌ ప్లస్‌లో ఉంది. అది డేవిడ్‌ వార్నర్‌ గ్యాంగ్‌కు కలిసొచ్చే అంశం. అంటే ఇక్కడ సన్‌రైజర్స్‌ చేయాల్సిందల్లా ముంబైపై గెలవడమే.

నెట్‌ రన్‌రేట్‌ కూడా టై అయితే..
ఆర్సీబీ, ఢిల్లీ, కేకేఆర్‌లు తమ తమ నెట్‌రన్‌రేట్లలో కొద్దిపాటి తేడాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ నెట్‌ రన్‌రేట్‌ కూడా టై అయితే ఏమి జరుగుతుందనే ప్రశ్న వస్తుంది. ఇలా జరగడం చాలా అరుదైనప్పటికీ ఆ అనుమానం మాత్రం సగటు క్రీడాభిమానుల్లో ఉంటుంది. నెట్‌ రన్‌రేట్‌ కూడా టై అయిన పక్షంలో ఏ జట్టు ఎక్కువ వికెట్లు సాధించిందో చూస్తారు. క్రికెట్‌ నిబంధన 16.10.2.3 ప్రకారం జట్ల నెట్‌ రన్‌రేట్‌ సమం అయితే అప్పుడు సీజన్‌ మొత్తానికి పోటీలో ఉన్న రెండు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిందో ఎవరో లెక్కిస్తారు. ఆ ప్రకారం ఎక్కువ వికెట్లు సాధించిన జట్టు మెరుగైన స్థానంలోకి వెళుతుంది. అదే సమయంలో వికెట్లు కూడా సమం అయితే 16.10.2.4 రూల్ ప్రకారం డ్రా తీస్తారు. 

కేకేఆర్‌ కష్టమే..
నెట్‌ రన్‌రేట్‌ సమం అయిన పక్షంలో కూడా కేకేఆర్‌ పరిస్థితి క్లిష్టంగానే ఉంది. ఆర్సీబీ, ఢిల్లీలు ఓవరాల్‌గా కేకేఆర్‌ కంటే అత్యధిక వికెట్లు సాధించాయి. అంటే నెట్‌రన్‌రేట్‌ టై అయినా ఆర్సీబీ, ఢిల్లీ ప్లేఆఫ్స్‌ బెర్తులకు ఢోకా ఉండదు. దాంతో సన్‌రైజర్స్‌-ముంబైల మ్యాచ్‌లో ఫలితం వచ్చే వరకూ కేకేఆర్‌ బెర్తు అనేది సందిగ్ధంలోనే ఉంటుంది. అక్కడ ముంబై గెలిస్తేనే కేకేఆర్‌కు అవకాశం తప్పితే, రెండో అవకాశం లేదు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో మెరిసి, బౌలింగ్‌లో కూడా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ప్రధానంగా బౌలింగ్‌ బలంతోనే ఇంతవరకూ వచ్చిన సన్‌రైజర్స్‌.. ముంబైతో మ్యాచ్‌లో పూర్తిస్థాయిలో రాణించడానికి కసరత్తులు చేస్తోంది.నెట్‌రన్‌రేట్‌ ఆధారంగా జట్టు ప్లేస్‌లను నిర్ణయించడం ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకూ జరగలేదు. కానీ ఈసారి పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండటంతో నెట్‌రన్‌రేట్‌ అనే అంశం హాట్‌ టాపిక్‌ అయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement