అబుదాబి: వెస్టిండీస్ వివాదాస్పద స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ ఐపీఎల్ సీజన్‌లో సందేహాస్పదంగా బౌలింగ్ చేస్తున్నాడనే కారణంతో అతన్ని పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిపై నిషేధం విధించకుండా యాక్షన్‌ను సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పించింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. దాంతో కొన్ని రోజులుగా తన బౌలింగ్ యాక్షన్‌పై తీవ్ర కసరత్తులు చేశాడు నరైన్. తన యాక్షన్‌ను సరిచేసుకుని మంచి ఫలితాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే సస్పెన్షన్ కాలంలో సునీల్ నరైన్ బౌలింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని ఐపీఎల్ సస్పెక్ట్ బౌలింగ్ యాక్షన్ కమిటీ పర్యవేక్షించింది. ఆ వీడియో ఫుటేజ్‌ను కేకేఆర్ యాజమాన‍్యం సదరు కమిటీ ఇవ్వడంతో దాన్ని పరిశీలించారు.
పలు కోణాల్లో, స్లో మోషన్‌లో నరైన్ యాక్షన్‌ను పరిశీలించిన కమిటీ.. నరైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఫుటేజ్‌ను పరిశీలించామని, బంతిని బౌల్ చేసే సమయంలో సునీల్ నరైన్ ఎల్‌బో బెండ్ మీదుగా చేతిని లేపడం.. ఐసీసీ పరిధికి లోబడే ఉన్నట్లు గుర్తించినట్లు కమిటీ వెల్లడించింది. అయితే ప్రస్తుత వీడియోల్లో కనిపించే విధంగానే ఐపీఎల్ టోర్నీలో కూడా బౌలింగ్ చేయాల్సి ఉంటుందని కమిటీ ఆదేశించింది. దీనికి భిన్నంగా బౌలింగ్ వేస్తే మాత్రం సస్పెన్షన్‌ను ఎదుర్కునే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈరోజు(ఆదివారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు నరైన్ అందుబాటులోకి రాలేదు. వచ్చే మ్యాచ్‌లో నరైన్ ఆడే అవకాశం మెండుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment