శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! | If-Shreyas Iyer Becomes T20I Captain Surya-Samson-Kuldeep Career Over | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం!

May 8 2026 5:52 PM | Updated on May 8 2026 7:09 PM

If-Shreyas Iyer Becomes T20I Captain Surya-Samson-Kuldeep Career Over

టీమిండియా ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సారథ్యంలో భారత్ మూడోసారి పొట్టి కప్పును అందుకుంది. అయితే బీసీసీఐ మాత్రం అప్పుడే 2028 టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూను సరికొత్తగా తయారు చేసేందుకు కసరత్తులు నిర్వహిస్తోంది. 

ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ అందుకున్న మూడో కెప్టెన్‌గా సూర్యకుమార్ నిలిచాడు. అయితే బీసీసీఐ మాత్రం వచ్చే 2028 టీ20 ప్రపంచకప్ నాటికి సూర్యకుమార్ స్థానంలో కొత్త టీ20 కెప్టెన్‌ను ఎంపిక చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో తన కెప్టెన్సీతో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు గిల్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బీసీసీఐ మాత్రం శ్రేయస్ అయ్యర్‌వైపే మొగ్గుచూపే అవకాశముంది. 

ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించడంతో పాటు ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌ను 2025లో ఫైనల్ చేర్చాడు. ఈ సీజన్‌లోనూ శ్రేయస్ కెప్టెన్‌గా సత్తా చాటుతూ పంజాబ్‌ను టైటిల్ దిశగా నడిపిస్తున్నాడు. 

ఒకవేళ శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌కు ముగింపు పడినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురే ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌, సంజూ శాంసన్‌, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌.

సూర్యకుమార్ యాదవ్‌
శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం మొదట జట్టు నుంచి దూరమయ్యేది సూర్యకుమార్‌. టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్‌కు ఘనమైన రికార్డు ఉంది. మిస్టర్ 360 డిగ్రీస్ పేరుతో అతడిని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గత రెండేళ్లలో సూర్యకుమార్ ఆటతీరు దారుణంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ అయిన తర్వాత అతడిలో మునుపటి ఆట కనిపించడం లేదు. 

ఇందుకు గణాంకాలే సాక్ష్యం. 2025 సీజన్‌లో టీమిండియా తరఫున 19 టీ20 మ్యాచ్‌లాడిన సూర్యకుమార్ 218 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 14 మ్యాచ్‌లాడిన సూర్య 484 పరుగులు సాధించాడు. గతంలో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు అవలీలగా సాధించిన సూర్య క్రమంగా తన ఫామ్‌ను కోల్పోతూ వచ్చాడు. 

2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూర్యకుమార్ 136 స్ట్రైక్‌రేట్‌తో 242 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్‌లోనూ సూర్యకుమార్ బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. 

మరో విషయం ఏంటంటే.. అయ్యర్ టీమిండియాలోకి వస్తే  నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. సూర్య కూడా అదే స్థానంలో బరిలోకి దిగుతుంటాడు. వయసు పరంగా చూసుకున్నా శ్రేయస్ (31 ఏళ్లు) కంటే సూర్యకుమార్(35 ఏళ్లు) నాలుగేండ్లు పెద్ద. ఏ లెక్కన చూసుకున్నా శ్రేయస్ టీమిండియా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇస్తే మొదటి వికెట్ సూర్యకుమార్‌దే.

సంజూ శాంసన్‌
ఈ లిస్టులో సంజూ శాంసన్ పేరు ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో అభిషేక్‌తో కలిసి శాంసన్ ఓపెనింగ్ వస్తున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లోనూ సూపర్‌-8 దశ నుంచి ఫామ్ అందుకున్న శాంసన్ టీమిండియాకు టైటిల్ అందించడంతో పాటు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయాడు. 

అయితే శ్రేయస్ కెప్టెన్ అయితే అతడి మదిలో కొందరు యువ ఆటగాళ్లు పేర్లు మెదలడం ఖాయం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌కు ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య సహా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేర్లను బయటపెట్టే అవకాశముంది. ఈ లెక్కన వీరిద్దరిలో ఎవరు జట్టులోకి వచ్చినా సంజూ శాంసన్ డగౌట్‌కు పరిమితం అవ్వాల్సిందే. 

ఇప్పటికే గిల్‌, జైస్వాల్ రూపంలో ఓపెనింగ్ స్థానాని​కి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో శాంసన్ ఫామ్ కోల్పోయి సరిగ్గా ఆడకుంటే మాత్రం కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లే.

కుల్దీప్ యాదవ్‌
కుల్దీప్ యాదవ్ టీమిండియాలో సీనియర్‌ బౌలర్‌గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రికెటర్లలో కుల్దీప్ కూడా ఒకడు. అయినప్పటికీ శ్రేయస్ కెప్టెన్ అయితే కుల్దీప్ జట్టులో స్థానంలో కోల్పోవచ్చు. తనకంటూ స్ట్రాంగ్ బౌలర్లు కావాలని అయ్యర్ అనుకుంటే మాత్రం కుల్దీప్ స్థానంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్, యజ్వేంద్ర చాహల్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 

2026 టీ20 ప్రపంచకప్‌లోనూ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ఆడాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ కుల్దీప్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడిన కుల్దీప్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినంత మాత్రానా వీళ్ల కెరీర్‌కు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశముంది. అయితే ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.

చదవండి: దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement