ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నీలో ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ బోణీ కొట్టింది. దుబాయ్ క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (52 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (29 బంతుల్లో 59; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు.
కెప్టెన్ నికోలస్ పూరన్ అర డజను సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ముంబై ఇన్నింగ్స్‌లో పోలార్డ్ (19 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్), ముహమ్మద్ వసీం (18) రెండంకెల స్కోర్లు చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఓలీ స్టోన్ 2, చమీరా ఓ వికెట్ దక్కించుకున్నారు.
హోప్ సెంచరీ వృధా
ఛేదనలో క్యాపిటల్స్ ఓపెనర్ షాయ్ హోప్ (59 బంతుల్లో 101; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. హోప్‌కు మరో ఎండ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. బెన్ డంక్ (10), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (16), గుల్బదిన్ నైబ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సికందర్ రజా (6), దుసన్ షనక (0) విఫలమయ్యారు. క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఫజల్ హక్ ఫారూఖీ, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. వకార్ సలామ్‌కిల్, అల్లా ఘజన్‌ఫర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. క్యాపిటల్స్ చేసిన స్కోర్‌లో హోప్ ఒక్కడే మూడొంతులు చేయడం విశేషం. 161 పరుగుల్లో హోప్ 101 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు, ఎక్స్‌ట్రాల రూపంలో 60 పరుగులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment