దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20, 2025 ఎడిషన్ (రెండో ఎడిషన్) నిన్న (జనవరి 11) ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్.. దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు పరాభవం ఎదురైంది. తప్పక గెలుస్తుందనున్న మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ పరుగు తేడాతో ఓటమిపాలైంది. విధ్వంసకర ఆటగాళ్లు నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్ జట్టులో ఉన్నా ముంబై ఇండియన్స్‌ను గెలిపించలేకపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేసింది. దుబాయ్ ఆటగాళ్లలో బ్రాండన్ మెక్‌ముల్లెన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. రోవమన్ పావెల్ (25), దసున్ షనక (13), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగా.. షాయ్ హోప్ 9, రొస్సింగ్టన్ 9, గుల్బదిన్ నైబ్ 2, ఫర్హాన్ ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ముంబై పేసర్ ఫజల్‌హక్ ఫారూకీ (4-0-16-5) ఐదు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి దుబాయ్ క్యాపిటల్స్‌ను ఇబ్బంది పెట్టాడు. అల్జరీ జోసఫ్, జహూర్ ఖాన్‌కు తలో వికెట్ దక్కింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో ఎంఐ ఎమిరేట్స్ కూడా తడబడింది. ఆ జట్టు 23 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కెప్టెన్ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన జట్టును గెలిపించుకునేందుకు విఫలయత్నం చేశాడు. పూరన్‌కు అకీల్ హొసేన్ (31 బంతుల్లో 30; 2 ఫోర్లు) కాసేపు సహకరించాడు. ఆఖరి ఓవర్‌లో కీరన్ పోలార్డ్ (15 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) ఎంత ప్రయత్నించినా తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. చివరి బంతికి ఆరు పరుగులు కావాల్సి ఉండగా పోలార్డ్ బౌండరీ బాదాడు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.
దుబాయ్ క్యాపిటల్స్ పరుగు తేడాతో గెలుపొందింది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఎంఐ ఎమిరేట్స్ 7 వికెట్ల కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. ఎమిరేట్స్ ఇన్నింగ్స్‌లో ముహమ్మద్ వసీం, ఆండ్రీ ఫ్లెచర్, అల్జరీ జోసఫ్ డకౌట్‌లు కాగా.. కుసాల్ పెరీరా 12, టామ్ బాంటన్ 7 పరుగులు చేశారు.
గెలుపు దూరం చేసిన గుల్బదిన్ నైబ్, ఓల్లీ స్టోన్
ఓ దశలో ఎంఐ ఎమిరేట్స్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. ఆ జట్టు 18 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే సాధించాల్సి ఉండింది. చేతిలో ఐదు వికెట్లు ఉండేవి. ఈ దశలో గుల్బదిన్ నైబ్ (4-0-13-3, ఓల్లీ స్టోన్ (4-1-14-2) ముంబైకు గెలుపును దూరం చేశారు. 18వ ఓవర్ వేసిన గుల్బదిన్ నైబ్ రెండు కీలక వికెట్లు తీసి (పూరన్, అల్జరీ జోసఫ్) కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అనంతరం 19వ ఓవర్ వేసిన ఓల్లీ స్టోన్ మరింత పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వచ్చే సరికి ముంబై గెలుపుకు 13 పరుగులు అవసరమయ్యాయి. ఫర్హాన్ ఖాన్ బౌలింగ్‌లో పోలార్డ్ రెండు బౌండరీలు బాదినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ఓవర్‌లో 11 పరుగులు మాత్రమే వచ్చాయి. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీసిన గుల్బదిన్ నైబ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment