IND vs AFG: యశస్వి జైస్వాల్‌ ఫెయిల్‌ | IND Vs AFG 2nd ODI, Yashasvi Jaiswal Fails Again As Fans Slam Missed Opportunity, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రాక రాక వచ్చిన అవకాశం.. జైస్వాల్‌ అట్టర్‌ ఫ్లాప్‌

Jun 17 2026 2:48 PM | Updated on Jun 17 2026 3:40 PM

IND vs AFG 2nd ODI: Yashasvi Jaiswal fails Wastes Lucky chance Fans slams

టీమిండియా స్టార్‌ యశస్వి జైస్వాల్‌ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

సెంచరీతో ముగించి..
ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మరోసారి ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్‌ అజేయ శతకంతో అలరించాడు.

మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.

రాక రాక వచ్చిన అవకాశం
అయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్‌కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనర్‌గా వచ్చిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్‌ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.

విమర్శలు
అఫ్గన్‌ యువ పేసర్‌ మహ్మద్‌ సలీమ్‌ సఫీ బౌలింగ్‌లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. కాగా సలీమ్‌ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్‌ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్‌పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్‌కప్‌-2027 జట్టులో బ్యాకప్‌ ఓపెనర్‌గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్‌ కిషన్‌ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్‌ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.

చదవండి: వైభవ్‌ వివాదం.. స్పందించిన బీసీసీఐ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement