IND VS AUS 2nd ODI: భారీ అంచనాల నడుమ ప్రతి మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్‌లుగా చెత్త ప్రదర్శన చేస్తూ ఉసూరుమనిపిస్తున్నాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో (51 బంతుల్లో 112) చివరిసారిగా సెంచరీ చేసిన స్కై.. ఆతర్వాత వరుస విఫలమవుతూ ఫ్యాన్స్‌కు విసుగు తెప్పిస్తున్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సూర్యకుమార్.. తొలి వన్డేలోనూ ఇదే తరహాలో తొలి బంతికే ఔటయ్యాడు. రెండు సార్లు మిచెల్ స్టార్కే స్కై వికెట్ తీశాడు. అది కూడా ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కైని వెంటనే వన్డే జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కొందరేమో వన్డేల్లో స్కైకి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని అంటుంటే.. మెజార్టీ శాతం అతన్ని సాగనంపాలని కోరుతున్నారు. పొట్టి ఫార్మాట్‌లో ఇరగదీసే స్కై.. వన్డేల్లో తేలిపోతుండటం అతని అభిమానులతో పాటు అతన్ని కూడా బాధిస్తుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో స్కైని మర్యాద పూర్వకంగా వన్డే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ వర్గాలు కూడా యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఆసీస్‌తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్‌మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (30), జడేజా (8) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment