టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అతడితో కలిసి ఆడిన జ్ఞాపకాలు మధురమైనవని.. ఆట పట్ల నితీశ్ అంకితభావం అమోఘమని కొనియాడాడు. ఆసీస్ గడ్డపై కూడా అతడు బంతిని స్వింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టుల్లో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ గురువారం మీడియాతో మాట్లాడాడు.
మాకు ఎంతో కీలకం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తమకు ఎంతో కీలకమైన సిరీస్ అన్న కమిన్స్.. టీమిండియా వంటి పటిష్ట జట్టుతో తలపడటం కఠినమైన సవాలు అని పేర్కొన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడటం ఎల్లప్పుడూ ఒత్తిడికి గురిచేస్తుందని.. అయితే, తాము అన్ని రకాలుగా ఈ సిరీస్‌కు సిద్ధమయ్యాం కాబట్టి ఆందోళన చెందడం లేదని తెలిపాడు.
టాలెంటెడ్ కిడ్ కానీ..
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తావన రాగా.. ‘‘ఎంతో ప్రతిభావంతుడైన కుర్రాడు. కానీ.. సన్‌రైజర్స్ తరఫున అతడికి పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఏదేమైనా అతడు టాలెంటెడ్ కిడ్. తన ఆట తీరుతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఇక్కడ కూడా బంతిని కాస్త స్వింగ్ చేయగలడనే అనుకుంటున్నా’’ అని కమిన్స్ కితాబులిచ్చాడు.
సన్‌రైజర్స్ గెలుపులో
కాగా ఐపీఎల్-2024లో కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత వైఫల్యాలను మరిపించేలా జట్టును ఏకంగా ఫైనల్స్‌కు చేర్చాడు. ఇక కమిన్స్ కెప్టెన్సీలో ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
ఈ ఏడాది రైజర్స్ తరఫున 303 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఆస్ట్రేలియాతో టెస్టులకు నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యాడు. పెర్త్‌లో అతడు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
చదవండి: పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment