Sakshi News home page

Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో..

Published Thu, Dec 8 2022 4:51 PM

Ind Vs Ban: Anxious BCCI To Hold Review Meeting With Rohit Virat Reports - Sakshi

India tour of Bangladesh, 2022 - ODI Series Loss : బంగ్లాదేశ్‌ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పటిష్ట జట్టుగా పేరొందిన రోహిత్‌ సేన.. బంగ్లా పర్యటనలో విఫలం కావడంపై మేనేజ్‌మెంట్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో సత్తా చాటుతున్న టీమిండియా అసలైన సమయంలో మాత్రం చేతులెత్తేస్తున్న సంగతి తెలిసిందే.

కీలక సమయాల్లో చేతులెత్తేసి!
రోహిత్‌ సారథ్యంలోని మాజీ చాంపియన్‌ ఆసియా టీ20 టోర్నీ-2022లో సూపర్‌-4 దశలోనే నిష్క్రమించడం సహా టీ20 ప్రపంచకప్‌-2022లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్‌ గెలిచినా.. శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలో వన్డే సిరీస్‌ను కోల్పోయింది.

ఈ క్రమంలో బంగ్లాదేశ్‌ పర్యటనకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో సులువుగానే వన్డే సిరీస్‌ గెలుస్తుందని భావించగా మొదటి మ్యాచ్‌లో బ్యాటర్లు, రెండో మ్యాచ్‌లో బౌలర్లు వైఫల్యం చెందడంతో బంగ్లా చేతిలో చిత్తైంది టీమిండియా. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక సిరీస్‌ను 0-2తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది.

బంగ్లా చేతిలో ఓటమిని ఊహించలేదు.. రాగానే రోహిత్‌ ఇంకా
ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ.. జట్టు ఆట తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైఫల్యాలపై సమీక్ష చేపట్టి తగిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. అదే విధంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలపైనా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి విరాట్‌ కోహ్లి సహా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులతో బీసీసీఐ అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 

ఈ మేరకు బీసీసీఐ కీలక అధికారి ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది ఆఫీస్‌ బేరర్లు బిజీగా ఉన్న కారణంగా బంగ్లాదేశ్‌ పర్యటనకు ముందు ఆటగాళ్లతో సమావేశం కాలేకపోయాం. ఈ టూర్‌లో టీమిండియా ప్రదర్శన ఘోరంగా ఉంది. బంగ్లాదేశ్‌ చేతిలో జట్టు ఓడిపోతుందని మేము అస్సలు ఊహించలేదు. వాళ్లంతా తిరిగి రాగానే మీటింగ్‌కు ఏర్పాటు చేస్తాం. నిజానికి ప్రపంచకప్‌ ముగిసిన తర్వాతే ఈ సమావేశం జరగాల్సింది’’ అని పేర్కొన్నారు.

చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్‌! రోహిత్‌తో పాటు
Team India Schedule: స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్‌లు.. షెడ్యూల్‌ విడుదల

Advertisement

What’s your opinion

Advertisement