
IND A VS BAN A 1st Unofficial Test: బంగ్లాదేశ్-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు పట్టు బిగించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. తొలి రోజు (నవంబర్ 29) ప్రత్యర్ధిని 45 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూల్చింది. సౌరభ్ కుమార్ (4/23), నవదీప్ సైని (3/21) బంగ్లా పతనాన్ని శాశించారు. అనంతరం నిన్ననే తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 36 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది.
తొలి రోజే అర్ధసెంచరీలు పూర్తి చేసుకుని జోరు మీదుండిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (61 బ్యాటింగ్), అభిమన్యు ఈశ్వరన్ (53 బ్యాటింగ్) రెండో రోజు మరింత రెచ్చిపోయారు. ఇద్దరు భారీ సెంచరీలు సాధించి జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. జైస్వాల్ (145; 20 ఫోర్లు, సిక్స్), ఈశ్వరన్ (142; 11 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 283 పరుగులు జోడించారు.
ఫలితంగా రెండో రోజు టీ విరామం సమయానికి భారత్.. 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. యశ్ ధుల్ (20) ఔట్ కాగా.. తిలక్ వర్మ (6), సర్ఫరాజ్ ఖాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగతుంది. కాగా, భారత-ఏ జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. వీటి అనంతరం టీమిండియా 3 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆ దేశంలో పర్యటిస్తుంది.