Harshit Rana, Soumya Sarkar Heat Argument In Emerging Asia Cup Semi Final - Sakshi
Sakshi News home page

Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్‌.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది'

Published Sat, Jul 22 2023 10:44 AM | Last Updated on Sat, Jul 22 2023 11:26 AM

Harshit Rana-Heat Argument-Soumya Sarkar Emerging Asia Cup Semi Final - Sakshi

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ 2023లో ఇండియా-ఏ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బంగ్లాదేశ్‌-ఏతో జరిగిన సెమీఫైనల్లో ఇండియా-ఏ జట్టు 51 పరుగుల తేడాతో ఘన విజ​యాన్ని అందుకుంది. ఇక​ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్లో అమితుమీ తేల్చుకోనుంది. ఈ సంగతి పక్కనబెడితే సెమీఫైనల్‌ సందర్భంగా ఇండియా, బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు ఎక్కడా తగ్గలేదు.

మొదట టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో వికెట్‌ పడ్డ ప్రతీసారి బంగ్లా ఆటగాళ్లు టీమిండియా బ్యాటర్లపై ఏదో ఒక కామెంట్‌ చేస్తూ పెవిలియన్‌ సిగ్నల్‌ చూపించారు. ఒక్కసారి అంటే ఏదో అనుకోవచ్చు.. పదే పదే అదే చర్యకు పాల్పడుతూ శ్రుతి మించారు. ఇదంతా టీమిండియా ఆటగాళ్లు గమనిస్తూనే వచ్చారు. మాకు టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్లుగా సైలెంట్‌గా ఉన్నారు. ఇక బంగ్లా ఇన్నింగ్స్‌ సమయంలో ఇండియా- ఏ ఆటగాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదు. బంగ్లా వికెట్‌ కోల్పోయిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో బంగ్లా సీనియర్‌ బ్యాటర్‌ సౌమ్యా సర్కార్‌, ఇండియా-ఏ ఆటగాడు హర్షిత్‌ రానాల మధ్య మాటల యుద్దం చోటుచేసుకోవడం ఆసక్తి కలిగించింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ యువరాజ్‌సిన్హ్‌ దోదియా వేశాడు. ఆ ఓవర్‌లో రెండో బంతిని సౌమ్యా సర్కర్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి స్లిప్‌లో ఉన్న నికిన్‌ జోస్‌కు దొరికిపోయాడు. కీలక వికెట్‌ కావడంతో ఇండియా-ఏ ఆటగాళ్లు సంబరాలు మొదలుపెట్టారు.

అయితే హర్షిత్‌ రానా సౌమ్యా సర్కర్‌ మొహం ముందు గట్టిగా అరుస్తూ పంచ్‌లు గుద్దుతూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఇది నచ్చిన సౌమ్యా సర్కార్‌ హర్షిత్‌ రానాతో గొడవకు దిగాడు. ఇద్దరు మాటమాట అనుకున్నారు. అంపైర్‌ వచ్చేలోపే ఇద్దరు దూషణకు దిగారు. ఇంతలో ఆటగాళ్లు వచ్చి ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు. సాయి సుదర్శన్‌ వచ్చి సౌమ్యా సర్కార్‌ను వెళ్లమంటూ పక్కకు తీసుకెళ్లాడు. అయితే పెవిలియన్‌ వెళ్తున్న సమయంలోనూ సౌమ్యా సర్కార్‌ హర్షిత్‌ రానాపై మాటల యుద్దం కొనసాగించాడు. 

అయితే హర్షిత్‌ రానా ఇంత వైల్డ్‌గా రియాక్ట్‌ అవ్వడానికి ఒక కారణం ఉంది. టీమిండియా బ్యాటింగ్‌ సమయంలో యష్‌దుల్‌ ఔటైన సందర్భంలో సౌమ్యా సర్కార్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేసి శ్రుతి మించాడు. ఇది మనసులో పెట్టుకున్న హర్షిత్‌ రానా సౌమ్యా సర్కార్‌ ఔటవ్వగానే  బదులు తీర్చుకున్నాడు. ''నువ్వు మొదలుపెట్టావ్‌..నేను పూర్తి చేశా.. లెక్క సరిపోయింది'' అంటూ కామెంట్‌ చేయడం స్టంప్‌ మైక్‌లో రికార్డయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: దురదృష్టవంతుల లిస్ట్‌లో బెయిర్‌ స్టో.. ఏడో క్రికెటర్‌గా

Lionel Messi: మెస్సీనా మజాకా.. క్లబ్‌లు మారినా గోల్స్‌​ మాత్రం ఆగడం లేదుగా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement