India Vs England 1st ODI: Score, Match Highlights, Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే

Published Tue, Mar 23 2021 1:08 PM | Last Updated on Tue, Mar 23 2021 9:48 PM

Ind Vs Eng 1st ODI: Toss, Live Score Updates, Highlights, Playing 11 - Sakshi

తొలి వన్డే భారత్‌దే.. 4 వికెట్లతో చెలరేగిన ప్రసిద్ధ్‌ కృష్ణ
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పర్యాటక ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా పేసర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ(4/54), శార్ధూల్‌ ఠాకూర్‌(3/37), భువనేశ్వర్‌ కుమార్‌(2/30) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ జట్టు 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటయ్యింది. ముఖ్యంగా అరంగేట్రం బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అద్భుతంగా బౌలింగ్‌ చేసి చేజారిపోతుందనుకున్న మ్యాచ్‌ను తిరిగి భారత్‌వైపు మళ్లించాడు. అతనికి శార్ధూల్‌, భువనేశ్వర్‌, కృనాల్‌(1/59) తోడవ్వడంతో మ్యాచ్‌ భారత్‌ వశమైంది. ధాటిగా ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టును టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా శుక్రవారం(మార్చి 26) జరుగనుంది. 

టీమిండియా గెలుపు ఖరారు
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా గెలుపు ఖరారయ్యింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌ డకౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 40 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 243/9.

కృనాల్‌కు తొలి వికెట్‌.. ఇంగ్లండ్‌ స్కోర్‌ 239/8
బ్యాటింగ్‌లో అదరగొట్టిన కృనాల్‌ పాండ్యాకు తన స్పెల్‌ ఆఖరి ఓవర్‌లో వికెట్‌ దక్కింది. 38.1 ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ పట్టడంతో సామ్‌ కర్రన్‌(20 బంతుల్లో 12; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు.‌‌‌

ఇంగ్లండ్‌ ఏడో వికెట్‌ డౌన్
ఇంగ్లండ్‌ చివరి ఆశాకిరణం మొయిన్‌ అలీ ఔటయ్యాడు. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో రాహుల్‌ క్యాచ్‌ పట్టడంతో మొయిన్‌ అలీ(37 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. 37.1 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 237/7. క్రీజ్‌లో సోదరులు సామ్‌ కర్రన్‌(12), టామ్‌ కర్రన్‌(1) ఉన్నారు.ఇంగ్లండ్‌ గెలుపునకు 72 బంతుల్లో 79 పరుగులు చేయాల్సి ఉంది.

ప్రసిద్ద్‌ కృష్ణ ఖాతాలో మరో వికెట్‌
అరంగేట్రం బౌలర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్(22 బంతుల్లో 18; ఫోర్‌​)ను ఔట్‌ చేసి తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కవర్స్‌లో కోహ్లి సునాయాస క్యాచ్ అందుకోవడంతో బిల్లింగ్స్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. 33 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 221/6. క్రీజ్‌లో  మొయిన్‌ అలీ(28 బంతుల్లో 23), సామ్‌ కర్రన్‌(2) ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే 17 ఓవర్లలో 97 పరుగులు చేయాల్సి ఉంది. ‌

క్యూకట్టిన ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు
టీమిండియా పేసర్‌ శార్ధూల్‌ ఠాకూర్‌ ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను భారత్‌వైపు మళ్లించాడు. 25 ఓవర్‌లో తొలుత మోర్గాన్‌ను ఔట్‌ చేసిన ఆయన.. ఆతరువాత బట్లర్‌(4 బంతుల్లో 2)ను ఎల్బీడబ్యూగా ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. క్రీజ్‌లో మొయిన్‌ అలీ(0), సామ్‌ బిల్లింగ్స్‌(1) ఉన్నారు. శార్ధూల్‌(5 ఓవర్లలో 3/33), ప్రసిద్ధ్‌ కృష్ణ(6 ఓవర్లలో 2/46)లకు వికెట్లు లభించాయి.

నాలుగో వికెట్‌ డౌన్‌.. మోర్గాన్‌(22) ఔట్‌
ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు వరుసపెట్టి పెవిలియన్‌ బాటపడుతున్నారు. ఆ జట్టు కెప్టెన్‌ మోర్గాన్‌(30 బంతుల్లో 22; ఫోర్‌, సిక్స్‌).. శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 24.1 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 176/4. టీమిండియా బౌలర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ, శార్ధూల్‌ ఠాకూర్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి.

బెయిర్‌ స్టో(94) ఔట్‌
ధనాధన్‌ బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను కంగారు పెట్టించిన ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో(66 బంతుల్లో 94; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. సెంచరీకి చేరువగా వెళ్లిన అతను భారీ షాట్‌ ఆడే క్రమంలో వికెట్‌ను చేజార్చుకున్నాడు. శార్ధూల్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ క్యాచ్‌ పట్టడంతో అతను పెవిలియన్‌ బాటపట్టాడు. 23 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 171/3. క్రీజ్‌లో మోర్గాన్‌(26 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), బట్లర్‌(0) ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌..స్టోక్స్‌‌(1) ఔట్
ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు అదరగొడుతున్నారు. బ్యాటింగ్‌లో కృనాల్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించగా, బౌలింగ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ ఇరగదీస్తున్నాడు. తొలుత జేసన్‌ రాయ్‌ని, ఆతరువాత స్టోక్స్‌(11 బంతుల్లో 1)ను ఔట్‌ చేసి మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తున్నాడు. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ పట్టడంతో స్టోక్స్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ వేసిన 17 ఓవర్‌ వికెట్‌ మెయిడిన్‌ కావడం విశేషం. 17 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్‌ స్కోర్‌ 137/2. క్రీజ్‌లో బెయిర్‌ స్టో(81), మోర్గాన్‌(0) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌.. జేసన్‌ రాయ్‌(46) ఔట్
టీమిండియా బౌలర్లకు ఎట్టకేలకు బ్రేక్‌ లభించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(35 బంతుల్లో 46; 7 ఫోర్లు, సిక్స్‌)ని అరంగేట్రం బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ బోల్తా కొట్టించాడు. 15 ఓవర్‌ రెండో బంతికి ప్రసిద్ధ్‌ కృష్ణ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సూర్యకుమార్‌ క్యాచ్‌ పట్టడంతో రాయ్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 135/1. క్రీజ్‌లో బెయిర్‌ స్టో(80), స్టోక్స్‌(0) ఉన్నారు.

ధాటిగా ఆడుతున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు
318 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పర్యాటక జట్టు బ్యాట్స్‌మెన్లు..ఆరంభం నుంచే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఓపెనర్లు బెయిర్‌ స్టో(47 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), జేసన్‌ రాయ్‌(31 బంతుల్లో 40; 5 ఫోర్లు, సిక్స్‌) వీరవిహారం చేస్తుండడంతో 13 ఓవర్ల ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 122 పరుగులు చేసింది. ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మెన్ల ధాటికి టీమిండియా బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు.

రాహుల్‌, కృనాల్‌ హాఫ్‌ సెంచరీలు
హార్ధిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్యా(31 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అరంగేట్రంలోనే అదిరిపోయే అర్ధశతకంతో అలరించాడు. కృనాల్‌కు తోడుగా మరో ఎండ్‌లో రాహుల్‌(43 బంతుల్లో 62; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సైతం భారీ షాట్లతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 317 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌(42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(9 బంతుల్లో 6; ఫోర్‌), ధవన్‌(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్‌ పాండ్యా (1) అవుటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3, మార్క్‌ వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్‌ విజయలక్ష్యం 318.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
టీమిండియా హార్డ్‌ హిట్టర్‌ హార్ధిక్‌ పాండ్యా (1) తీవ్రంగా నిరాశపరిచాడు. మొదటి నుంచి పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడిన ఆయన.. 9 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో బెయిర్‌ స్టో క్యాచ్‌ అందుకోవడంతో హార్ధిక్‌ అవుటయ్యాడు. దీంతో 40 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్‌(13), కృనాల్‌(0) ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3, మార్క్‌ వుడ్‌కు 2 వికెట్లు దక్కాయి. 

సెంచరీ చేజార్చుకున్న ధవన్‌..
టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ కెరీర్‌లో 18వ శతకాన్ని నమోదు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. స్టోక్స్‌ బౌలింగ్లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో ధవన్‌ పెవిలియన్‌ బాటపట్టాడు. మ్యాచ్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఆయన.. ఆతరువాత గేర్‌ మార్చి చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. సిక్సర్‌ బాది 68 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్న అతను.. 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు. క్రీజ్‌లో కేఎల్‌ రాహుల్‌(12 బంతుల్లో 6; ఫోర్‌), హార్ధిక్‌ పాండ్యా(0) ఉన్నారు. 39 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు సాధించింది. రోహిత్‌(42 బంతుల్లో 28; 4 ఫోర్లు), కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు), శ్రేయస్‌ అయ్యర్‌(9 బంతుల్లో 6; ఫోర్‌), ధవన్‌(106 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌, స్టోక్స్‌కు  చెరో రెండు వికెట్లు దక్కాయి. 

మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ పట్టడంతో శ్రేయస్‌ అయ్యర్‌(9 బంతుల్లో 6; ఫోర్‌) పెవిలియన్‌ బాటపట్టాడు. 35 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 187/3. ధవన్‌(95), కేఎల్‌ రాహుల్‌(0) క్రీజ్‌లో ఉన్నారు.

కోహ్లి(56) ఔట్‌
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(60 బంతుల్లో 56; 6 ఫోర్లు) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. 32.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 169/2. క్రీజ్‌లో ధవన్‌(83), శ్రేయస్‌ అయ్యర్‌(0) ఉన్నారు.

కోహ్లి సూపర్‌ ఫిఫ్టీ
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన స్టంన్నింగ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. టీ20 సిరీస్‌లో వరుస అర్ధశతకాలతో అదరగొట్టిన కోహ్లి.. వన్డే సిరీస్‌లో మరో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. 50 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో కెరీర్‌లో 62వ అర్ధశతకాన్ని నమోదు చేశాడు. 30 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 159/1. క్రీజ్‌లో ధవన్‌(77), కోహ్లి(52) ఉన్నారు.

శిఖర్‌ ధవన్‌ హాఫ్‌ సెంచరీ
సహచరుడు రోహిత్‌ అవుటయ్యాక శిఖర్‌ ధవన్‌(72 బంతుల్లో 55; 5 ఫోర్లు, సిక్స్‌) దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్‌లో 32 హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది అతను హాఫ్‌ సెంచరీ మార్కును చేరుకున్నాడు. 25 ఓవర్ల తర్వాత టీమిండియా వికెట్‌ నష్టానికి 117 పరుగులు చేసింది. ధవన్‌కు తోడుగా క్రీజ్‌లో కెప్టెన్‌ కోహ్లీ(36 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఉన్నాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..
16వ ఓవర్ తొలి బంతికి హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ(28) ఔటయ్యాడు. తన శైలికి భిన్నంగా ఆరంభం నుంచి ఆచితూచి ఆడిన రోహిత్..‌ 42 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. వైడ్‌ బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో రోహిత్‌ ఔటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్‌ కోహ్లి వచ్చాడు. 

15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 64/0

పుణే: టెస్టు, టి20 సిరీస్‌లను దక్కించుకుని జోరుమీదున్న టీమిండియా వన్డే సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో మంగళవారం జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ ద్వారా కృనాల్‌ పాండ్యా, ప్రసీధ్‌ కృష్ణలు వన్డేల్లో అరంగేట్రం చేశారు.  ఇప్పటికే టీమిండియా తరఫున  కృనాల్‌ టీ20లు ఆడగా, ప్రసీధ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌.  కృనాల్‌ 233వ టీమిండియా వన్డే ప్లేయర్‌గా క్యాప్‌ అందుకోగా, ప్రసీధ్‌‌ 234వ ప్లేయర్‌గా క్యాప్‌ ధరించాడు. వీరిద్దరికీ రవిశాస్త్రి క్యాప్‌లు అందజేసి అభినందనలు తెలియజేశాడు. 

ఇక వరుసగా రెండు టెస్టులు, ఐదు టి20ల తర్వాత మ్యాచ్‌లు జరిగే వేదిక మారినా... కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్‌ నిర్వహించనున్నారు. టి20 సిరీస్‌ ఆడిన భారత జట్టే దాదాపుగా వన్డేల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టి20లో విఫలమై ఆ తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్‌ ధావన్‌ వన్డేలో ఓపెనర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. 2016–17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ 2–1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి: టీమిండియా ముందున్న రికార్డులు ఇవే!)


తుది జట్లు 

భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్, హార్దిక్, కృనాల్‌, భువనేశ్వర్, కుల్దీప్, శార్దూల్‌, ప్రసీధ్‌ కృష్ణా


ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, స్యామ్‌ కరన్‌, టామ్‌ కరన్, రషీద్, మొయిన్‌ అలీ, మార్క్‌వుడ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement