![Ind Vs Eng 2nd Test Day 4 Vizag: India Beat England By 106 Runs Level Series 1 1 - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/5/indvsengbbci2.jpg.webp?itok=tEpw1YEr)
బౌలర్ల విజృంభణ.. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం(PC: BCCI)
Ind vs Eng 2nd Test- India won by 106 runs: ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. విశాఖపట్నం మ్యాచ్‌లో పర్యాటక జట్టును ఏకంగా 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా హైదరాబాద్ టెస్టు పరాభవానికి బదులు తీర్చుకుని... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది.
యశస్వి ‘డబుల్’ కారణంగా
విశాఖ వేదికగా శుక్రవారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత సారథి రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ(209) కారణంగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు స్కోరు చేయగలిగింది.
‘ఆరే’సిన బుమ్రా అద్భుత ప్రదర్శనతో
ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. దీంతో 55.5 ఓవర్లలోనే ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.
ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. గిల్ సెంచరీ
ఈ నేపథ్యంలో రెండో రోజే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. అయితే, మూడో రోజు టీమిండియాకు పెద్దగా కలిసి రాలేదు. ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(17), రోహిత్ శర్మ(13) వికెట్లు కోల్పోయింది. శుబ్‌మన్ గిల్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్(45), అశ్విన్(29) అతడికి అండగా నిలబడ్డారు.
ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన
ఈ క్రమంలో 255 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. ఇంగ్లండ్‌కు 399 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, నాలుగో రోజు ఆట ఆరంభం నుంచే చెలరేగిన భారత బౌలర్లు 292 పరుగులకే ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. దీంతో నాలుగో రోజు ఆట కూడా పూర్తికాకుండానే.. టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక బుమ్రా, అశ్విన్‌లకు తలా మూడు వికెట్లు దక్కగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ ఒక్కో వికెట్ తీశారు. ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్‌ను రనౌట్ చేయడంలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ భాగమయ్యాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్
►వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియం, విశాఖపట్నం
►టాస్: టీమిండియా... బ్యాటింగ్
►టీమిండియా స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 396-10 (112 ఓవర్లలో)
►ఇంగ్లండ్ స్కోరు(మొదటి ఇన్నింగ్స్): 253-10 (55.5 ఓవర్లలో)
►టీమిండియా స్కోరు(రెండో ఇన్నింగ్స్): 255-10 (78.3 ఓవర్లలో)
►ఇంగ్లండ్ విజయ లక్ష్యం: 399 రన్స్.
►లక్ష్యాన్ని ఛేదించలేక 292 పరుగులకే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్
►విజేత: టీమిండియా
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా(తొమ్మిది వికెట్లు)- కెరీర్‌లో రెండో అత్యుత్తమ గణాంకాలు(9/91).
చదవండి: ఒకే ఒక్క పరుగు.. 80 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment