ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖలో టీమిండియాతో రెండో టెస్ట్‌లో తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో విశాఖ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైనా గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భారత ఆటగాళ్లు సైతం ఈ మ్యాచ్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. మరోవైపు తొలి టెస్ట్ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో ఇంగ్లండ్ సైతం ఉరకలేస్తుంది. ఆ జట్టు కూడా గెలుపుపై ధీమాగా ఉంది.
విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో టీమిండియా ఓటమనేదే ఎరుగదు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ విజయఢంకా మోగించింది.
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 246 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (167), పుజారా (119) సెంచరీలతో కదంతొక్కారు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ సహా ఎనిమిది వికెట్లతో (మ్యాచ్‌లో) ఇంగ్లండ్ పతనాన్ని శాశించాడు.
తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన విరాట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీతో (81) రాణించాడు. బ్యాటింగ్‌లో విరాట్, బౌలింగ్‌లో అశ్విన్ చెలరేగడంతో ఈ మ్యాచ్ వన్‌సైడెడ్‌గా సాగింది.
2019లో ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో భారత్.. సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ భారీ తేడాతో (203 పరుగులు) విజయం సాధించింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (215) డబుల్ సెంచరీతో, రోహిత్ శర్మ (176) భారీ శతకంతో విజృంభించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 502 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం సౌతాఫ్రికా సైతం టీమిండియాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. డీన్ ఎల్గర్ (160), డికాక్ (111 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులు చేసింది. అశ్విన్ 7 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.
అనంతరం రోహిత్ శర్మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మరోసారి రెచ్చిపోయాడు. ఈసారి అతను మెరుపు శతకంతో (127) విరుచుకుపడ్డాడు. అతనికి తోడు పుజారా (81) రాణించడంతో భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 323 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా షమీ (5/35), జడేజా (4/87) ధాటికి 191 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌కు ముందు టీమిండియాను గాయాల బెడద కలవరపెడుతుంది. తొలి టెస్ట్ సందర్భంగా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడ్డారు. విశాఖలో ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న విరాట్ కోహ్లి సిరీస్‌కు ముందు నుంచే అందుబాటులో లేడు. ఈ ప్రతికూలతల నడుమ టీమిండియా విశాఖలో విజయయాత్ర కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment