
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. రహానే బ్యాటింగ్ చేస్తుండగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పంత్.. తనకేదీ పట్టదన్నట్లుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ (షాడో బ్యాటింగ్) చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అండర్సన్ బంతిని సంధించాక పంత్ అప్పటికప్పుడు అప్రమత్తమయ్యాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పంత్ షాడో బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసి రహానే క్రీజు నుంచి ఎందుకు పక్కకు తప్పుకోలేదని కొందరు ప్రశ్నిస్తుంటే, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచే ఆండర్సన్‌ను ఎదుర్కొనేందుకు పంత్ సిద్ధమయ్యాడంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.
Pant non-striker shadow batting #ENGvIND pic.twitter.com/hYGoBKg3zh
— Cat Jones (@Cricketbatcat) August 28, 2021
కాగా, ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్‌లో పంత్ దారుణంగా విఫలమవుతున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులు మాత్రమే చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో పంత్ రెండుసార్లు రాబిన్సన్‌కే దొరికిపోయాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. గత కొన్ని మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతూ టీమిండియా చోటును మళ్లీ ప్రశ్నార్ధకంగా మార్చుకునేలా ఉన్నాడు. ప్రస్తుత సిరీస్‌లో పంత్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 87 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: పిచ్ బాగానే ఉంది.. మేమే పొరపాట్లు చేశాం: టీమిండియా కెప్టెన్