అభిషేక్ శర్మ(Abhishek Sharma)కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఎంతో కీలకమని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఈ సిరీస్‌లో గనుక విఫలమైతే ఈ పంజాబీ బ్యాటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నాడు. కాబట్టి ఈసారి అభిషేక్ శర్మ తీవ్రమైన ఒత్తిడిలో మునిగిపోవడం ఖాయమన్న ఆకాశ్ చోప్రా(Aakash Chopra).. సవాళ్లను అధిగమిస్తే మాత్రం మరికొన్ని రోజులు టీమిండియాలో కొనసాగుతాడని అభిప్రాయపడ్డాడు.
అరంగేట్రంలో డకౌట్.. ఆ వెంటనే సెంచరీ
గతేడాది జూలైలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా.. అభిషేక్ శర్మ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. మరుసటి మ్యాచ్‌లో సెంచరీ బాది సత్తా చాటాడు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝులిపించలేకపోయాడు.
ఇక ఇప్పటి వరకు 12 టీ20లు పూర్తి చేసుకున్న అభిషేక్ వర్మ కేవలం 256 పరుగులకే పరిమితం అయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏ మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ అభిషేక్ తనను నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం కావొచ్చని అభిప్రాయపడ్డాడు.
అతడికి ఊపిరి కూడా ఆడనివ్వడు
‘‘ఈసారి కూడా సెలక్టర్లు అభిషేక్ శర్మపై నమ్మకం ఉంచారు. అతడిని జట్టులో కొనసాగించడం నాకూ నచ్చింది. అయితే, అతడు ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) టీ20 జట్టులోకి దూసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి అభిషేక్‌కు అతడితో పోటీ ఊపిరాడనివ్వదనడంలో సందేహం లేదు. యశస్వి జైస్వాల్ కూడా లెఫ్టాండర్ బ్యాటర్ కావడం అభిషేక్ శర్మకు మరో మైనస్. జైసూ మూడు ఫార్మాట్లకు తగిన ఆటగాడు. టెస్టు, టీ20లలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
అలా అయితే వృథానే
ఇక వన్డేల్లో కూడా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు’’ అని పేర్కొన్నాడడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసమే.. టీ20లలో అతడికి విశ్రాంతినిచ్చారేమోనన్న అభిప్రాయాలు ఉన్నాయన్నాడు ఆకాశ్ చోప్రా. ఒకవేళ ఇంగ్లండ్‌తో వన్డేల్లో శుబ్‌మన్ గిల్- రోహిత్ శర్మనే ఇన్నింగ్స్ ఆరంభిస్తే.. జైసూను ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసినందుకు ఫలితం ఉండదని పేర్కొన్నాడు.
ఒకే జట్టుతో ఆడతామన్న టీమిండియా సారథి
ఏదేమైనా యశస్వి జైస్వాల్ మాత్రం తిరిగి టీ20 జట్టులోకి వస్తే.. అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇ దిలా ఉంటే.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఒకే జట్టుతో ఆడేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వెల్లడించాడు. అయితే, ఆకాశ్ చోప్రా అన్నట్లు అభిషేక్ శర్మ మరోసారి విఫలమైతే అతడిపై వేటు తప్పకపోవచ్చు. కాగా బుధవారం(జనవరి 22) నుంచి ఇండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ మొదలుకానుంది.
చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు
Comments
Please login to add a commentAdd a comment