
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానేను పక్కన పెట్టి, అతడి స్థానంలో ఇతర ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఫాంలో లేని వాళ్లు తప్పుకొంటేనే కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు. రహానేకు ఉద్వాసన పలకడం ద్వారా హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో అజింక్య రహానే పేలవమైన ప్రదర్శనతో తేలిపోయిన సంగతి తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ సిరీస్(లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అర్థశతకం చేసినప్పటికీ ఫాం కొనసాగించలేకపోయాడు)లో మాత్రమే కాదు.. గతేడాది మెల్‌బోర్న్ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు. దీంతో రహానే ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి.
టీమిండియా టెస్టు దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సైతం రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మంజ్రేకర్ స్పందిస్తూ.. ‘‘జట్టులో చోటు కోసం ఎదురుచూసే వారి గురించి కూడా ఆలోచించాలి. నన్నే ఉదాహరణగా తీసుకోండి. అప్పట్లో నన్ను డ్రాప్ చేస్తేనే కదా.. రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లు టీంలోకి వచ్చారు.
ఇప్పుడు హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. రహానేలో మునుపటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. రిజర్వు బెంచ్‌లో ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక రహానేకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చాయని.. మరో మ్యాచ్‌లో ఆడే అవకాశం గనుక వస్తే అతడు నిజంగా అదృష్టవంతుడేనని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment