
లండన్: ప్రతీసారి మాస్కులు ధరించి బయటికి వెళ్లడం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ యూకే డెల్టా వేరియంట్ లక్షణాలు కనిపించడం టీమిండియాను కలవరానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభానికి పంత్‌తో పాటు సహాయక సిబ్బంది దయానంద్ గరానికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే పంత్‌కు కరోనా రావడంపై స్పందించిన దాదా అతన్ని వెనుకేసుకొచ్చాడు.
''ఇంగ్లండ్‌లో ఇప్పుడు రూల్స్ మారాయి. ఇటీవలే జరిగిన యూరోకప్ 2020, వింబుల్డన్ మ్యాచ్‌లకు చాలావరకు ప్రేక్షకులు మాస్క్ పెట్టుకోకుండానే వచ్చారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం మన ఆటగాళ్లకు 20 రోజుల విరామం లభించింది. రూల్స్ సవరించడంతో మాస్కులు పెట్టుకోకుండా తిరిగారు.. అయినా రోజు మొత్తం మాస్క్ ధరించి బయట తిరగడం ఇబ్బందిగానే ఉంటుంది. ఇక పంత్ గురించి మేం దిగులు చెందడం లేదు. అతని ఆరోగ్యం త్వరగానే మెరుగవుతోంది. టెస్టు సిరీస్ ప్రారంభంలోగా పంత్ జట్టుకు అందుబాటులోకి వస్తాడు.'' అని చెప్పుకొచ్చాడు.
కాగా ఇంగ్లండ్, టీమిండియాల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది. విరామం అనంతరం భారత ఆటగాళ్లు మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20 నుంచి చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరిగే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బృందం కౌంటీ సెలక్ట్ ఎలెవన్ జట్టుతో తలపడుతుంది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఐదుగురు మినహా మిగతావారంతా ఈ మ్యాచ్ కోసం గురువారం సాయంత్రం లండన్ నుంచి డర్హమ్‌కు చేరుకున్నారు.
పంత్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని...వరుసగా రెండు ఆర్టీపీసీఆర్ టెస్టులు నెగెటివ్‌గా వస్తే అతనూ జట్టుతో చేరతాడని బోర్డు వెల్లడించింది. అయితే ‘నెగెటివ్’గా వచ్చినా కోలుకునేందుకు సమయం పడుతుంది కాబట్టి అతను ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సాహా కూడా ఐసోలేషన్‌లో ఉండటంతో కేఎల్ రాహుల్ కీపర్‌గా వ్యవహరించవచ్చు. మరో వైపు భారత్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తలపడే ‘కౌంటీ సెలెక్ట్ ఎలెవన్’ జట్టును ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే టెస్టులు ఆడిన జేమ్స్ బ్రాసీ, హసీబ్ హమీద్‌లు ఇందులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment