Ireland Vs India, 1st T20I: Rinku Singh, Prasidh Krishna Make T20I Debut; Jitesh Sharma Misses Out - Sakshi
Sakshi News home page

Ind Vs Ire: వాళ్లిద్దరి అరంగేట్రం.. జితేశ్‌ శర్మకు మొండిచేయి..

Published Fri, Aug 18 2023 7:54 PM | Last Updated on Fri, Aug 18 2023 8:19 PM

Ind vs Ire: Rinku Singh Prasidh Krishna Make T20I Debuts Jitesh Sharma Misses Out - Sakshi

Ireland vs India, 1st T20I: అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలన్న భారత యువ బ్యాటర్‌ రింకూ సింగ్‌ కల ఎట్టకేలకు నెరవేరింది. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐరిష్‌ జట్టుతో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా చేతుల మీదుగా క్యాప్‌ అందుకున్నాడు.

పేద కుటుంబం నుంచి వచ్చి
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్‌ది పేద కుటుంబం. అయితే, చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతడు.. ఇంటింటికి గ్యాస్‌ బండలు మోస్తూనే ఆటపై దృష్టి సారించాడు. దేశవాళీ క్రికెట్‌లో తన ప్రతిభను నిరూపించుకుని ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ రింకూను కొనడంతో అతడి రాత మారింది. ఆరంభంలో బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చినా.. రింకూ ఓపికగా ఎదురుచూశాడు. ఈ క్రమంలో 25 ఏళ్ల లెఫ్టాండ్‌ బ్యాటర్‌ ఐపీఎల్‌-2023లో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 

ఐపీఎల్‌-2023లో సత్తా చాటి
మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో 149.53 స్ట్రైక్‌రేటుతో  474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడిన రింకూ సింగ్‌ తొలుత ఆసియా క్రీడలు-2023 జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌ నిమిత్తం ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టులో చోటు దక్కడంతో శుక్రవారం అరంగేట్రం చేశాడు.

జితేశ్‌కు మొండిచేయి
ఇక రింకూ సంగతి ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌తో కచ్చితంగా టీమిండియా క్యాప్‌ అందుకుంటాడనుకున్న మరో బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు నిరాశే మిగిలింది. వెస్టిండీస్‌ పర్యటనలో మెరుగ్గా రాణించకపోయినప్పటికీ సీనియర్‌ వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కింది. దీంతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ ఇంకొన్నాళ్లు వేచిచూడకతప్పదు.

డబ్లిన్‌లో మూడు మ్యాచ్‌లు
ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా కర్ణాటక బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ అంతర్జాతీయ టీ20లలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రసిద్‌కు కూడా బుమ్రా టీమిండియా క్యాప్‌ అందించాడు. రింకూ, ప్రసిద్‌ల అరంగేట్రానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్‌ చేయగా.. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇక డబ్లిన్‌ వేదికగా టీమిండియా- ఐర్లాండ్‌ల మధ్య ఆగష్టు 18, 20, 23 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

టీమిండియా:
జస్‌‍ప్రీత్‌ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ , ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.

చదవండి: బౌలింగ్‌లోనూ 'కింగే'.. చెక్కుచెదరని బౌలింగ్‌ రికార్డు విరాట్‌ సొంతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement