IND vs NZ: దంచికొట్టిన కాన్వే.. టీమిండియాకు చేదు అనుభవం! | IND Vs NZ 1st Test Day 2: New Zealand Lead By 134 Runs After India 46 All Out, Check Score Details Inside | Sakshi
Sakshi News home page

IND vs NZ 1st Test: టీమిండియా విఫలం.. కివీస్‌దే పైచేయి! ఆధిక్యం ఎంతంటే?

Published Thu, Oct 17 2024 5:54 PM | Last Updated on Thu, Oct 17 2024 6:18 PM

Ind vs NZ 1st Test Day 2: New Zealand Lead by 134 Runs After India 46 All Out

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. స్టార్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్‌ అయింది. తద్వారా చెత్త రికార్డులతో పాటు విమర్శలూ మూటగట్టుకుంది. ఇక బౌలింగ్‌లోనూ మన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బ్యాటర్లు పరుగులు రాబట్టలేక చతికిలపడిన పిచ్‌పై కివీస్‌ బ్యాటర్లు మెరుగైన స్కోర్లు సాధించారు. ఓవరాల్‌గా రెండో రోజు కివీస్‌దే పైచేయి అయింది.

భారీ వర్షం వల్ల తొలిరోజు ఆట రద్దు
కాగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టులో బుధవారం మొదటి రోజు ఆట సాధ్యం కాని విషయం తెలిసిందే. ఉదయం నుంచి వర్షం కురవడంతో కనీసం టాస్‌ కూడా పడకుండానే తొలి రోజు ముగిసింది. షెడ్యూల్‌ ప్రకారం 9 గంటలకు టాస్‌ వేయాల్సి ఉండగా... ఆ సమయంలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లకే పరిమితమయ్యారు. కాసేపటికి వరుణుడు తెరిపినివ్వడంతో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్న చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ ప్రారంభం కావడం ఖాయమే అని అభిమానులు ఆశపడ్డారు.

కానీ గత రెండు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తుండటంతో గ్రౌండ్‌ను పూర్తిగా కవర్స్‌తో కప్పి ఉంచారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు ‘హాక్‌–ఐ’ టెక్నాలజీ పరికరాలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ముందస్తు లంచ్‌ బ్రేక్‌ ప్రకటించి ‘హాక్‌–ఐ’ పరికరాలను అమర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే టీ విరామ సమయం కూడా మించి పోగా... కాసేపటికే మరోసారి భారీ వర్షం మైదానాన్ని ముంచెత్తింది. దీంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.  

రెండో రోజు కరుణించిన వరణుడు
ఈ క్రమంలో గురువారం కూడా ఆట మొదలవుతుందో లేదోనన్న సందేహాల నడుమ ఎట్టకేలకు వరణుడు కరుణించాడు. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, ఆరంభం నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌(13),  కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2) నిరాశపరచగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, సర్ఫరాజ్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యారు.

వికెట్ల పతనం
ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ 20 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించారు. ఇక టెయిలెండర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు, బుమ్రా ఒకటి, సిరాజ్‌ నాలుగు(నాటౌట్‌) పరుగులు చేశారు. 

దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లు మాత్రమే ఆడి కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో మ్యాచ్‌ హెన్నీ ఐదు వికెట్లు కూల్చగా.. విలియం రూర్కీ నాలుగు, టిమ్‌ సౌతీ ఒక వికెట్‌ పడగొట్టారు.

కాన్వే హీరో ఇన్నింగ్స్‌
ఆ తర్వాత బ్యాటింగ్‌ మొదలుపెట్టిన న్యూజిలాండ్‌కు డెవాన్‌ కాన్వే శుభారంభం అందించి.. రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిపాడు. ఓపెనర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(15) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ కాన్వే 105 బంతులాడి 91 పరుగులతో అదరగొట్టాడు. 

విల్‌ యంగ్‌ 33 పరుగులు చేయగా.. గురువారం ఆట పూర్తయ్యేసరికి రచిన్‌ రవీంద్ర 22, డారిల్‌ మిచెల్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ భారత్‌ కంటే 134 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement