
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఘోర పరాభావం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
కివీ బ్యాటర్లు విల్ యంగ్(48), రచిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బ్లాక్ క్యాప్స్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. కానీ తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులకే ఆలౌట్ కావడంతో ప్రత్యర్ధి ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది.
సర్ఫరాజ్ సూపర్ సెంచరీ..
మొదటి ఇన్నింగ్స్‌లో భాతర బ్యాటర్లు విఫలమైనప్పటకి రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అదరగొట్టారు. కేఎల్ రాహుల్, జడేజా మినహా మిగితా ప్లేయర్లందరూ తమ బ్యాట్‌కు పనిచెప్పారు. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.
195 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 18 ఫోర్లు, 3 సిక్స్‌లతో 150 పరుగులు చేశాడు. సర్ఫరాజ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మరోవైపు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 99 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు విరాట్ కోహ్లి(70), రోహిత్ శర్మ(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
36 ఏళ్ల తర్వాత తొలి సారి
కాగా భారత్ గడ్డపై కివీస్ టెస్టు విజయం సాధించడం 36 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. న్యూజిలాండ్ చివరగా 1988లో వాంఖడే వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు భారత్‌లో 36 ఏళ్ల తర్వాత బ్లాక్ క్యాప్స్ విజయకేతనం ఎగరవేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పుణే వేదికగా ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది.
Who else but Bumrah?! ⚡
Catch the thrilling finale to the first #INDvNZ Test, LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex#IDFCFirstBankTestTrophy #JioCinemaSports pic.twitter.com/NDEGpW64Se— JioCinema (@JioCinema) October 20, 2024