Ind vs SA: సెంచరీతో చెలరేగిన ఎల్గర్‌.. తొమ్మిదేళ్ల రికార్డు బ్రేక్! | India Vs South Africa 1st Test Day 2: Dean Elgar Slams 14th Century Rare Feat - Sakshi
Sakshi News home page

Ind vs SA: సెంచరీతో చెలరేగిన ఎల్గర్‌.. ఆ రికార్డు బ్రేక్‌! అభినందించిన కోహ్లి

Published Wed, Dec 27 2023 7:19 PM | Last Updated on Wed, Dec 27 2023 7:47 PM

Ind vs SA 1st Test Day 2 Dean Elgar Slams 14th Century Rare Feat - Sakshi

South Africa vs India, 1st Test Day 2: టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ సెంచరీతో చెలరేగాడు. కఠినమైన పిచ్‌పై వికెట్‌ పడకుండా జాగ్రత్త పడుతూనే.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత బౌలర్లకు కొరకరానికొయ్యగా తయారయ్యాడు. ఫేర్‌వెల్‌ సిరీస్‌లో 140 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని తన కెరీర్‌లో మూడో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు.

కాగా సెంచూరియన్‌ వేదికగా సౌతాఫ్రికా- టీమిండియా మధ్య మంగళవారం బాక్సిండే టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య ప్రొటిస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో.. 208/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో బుధవారం నాటి ఆటను ఆరంభించిన టీమిండియా.. 245 పరుగులకు ఆలౌట్‌ అయింది.

వికెట్లు పడిన ఆనందం నిలవనీయకుండా
ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ ఐడెన్‌ మార్క్రమ్‌ను 5 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. అయితే, ఎల్గర్‌ ఆ సంతోషాన్ని మరీ ఎక్కువ సేపు నిలవనీయలేదు. 

యువ ప్లేయర్‌ టోనీ డీ జోర్జితో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. కానీ జస్‌ప్రీత్‌ బుమ్రా దెబ్బకు టోనీ 28, కీగాన్‌ పీటర్సన్‌ 2 పరుగులకు అవుట్‌ కాగా... సౌతాఫ్రికా మరో రెండు రెండు వికెట్లు కోల్పోయింది. 

ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ
ఈ క్రమంలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అరంగేట్ర బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగ్హామ్‌తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ఎల్గర్‌ ముందుకు సాగాడు. నెమ్మది నెమ్మదిగా స్కోరు పెంచుకుంటూ 42.1 ఓవర్‌ వద్ద భారత పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది శతకం పూర్తి చేసుకున్నాడు.

టెస్టుల్లో ఎల్గర్‌కు ఇది 14వ శతకం. పటిష్ట టీమిండియాతో సిరీస్‌ తర్వాత తను రిటైర్‌ అవుతున్న క్రమంలో సెంచరీ బాదడంతో  ఈ వెటరన్‌ ఓపెనర్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక ఎల్గర్‌ సెంచరీ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్న సమయంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి చప్పట్లతో అతడిని అభినందించడం విశేషం.

తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత..
సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు సెంచరీ చేసి తొమ్మిదేళ్లకు పైగానే అయింది. ఎల్గర్‌ తాజా మ్యాచ్‌లో శతకం బాదడం ద్వారా ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. స్వదేశంలో 2014 తర్వాత భారత్‌పై సెంచరీ సాధించిన సౌతాఫ్రికా తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో కఠిన పిచ్‌పై ఈ మేరకు అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన డీన్‌ ఎల్గర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక టీ విరామ సమయానికి సౌతాఫ్రికా 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఎల్గర్‌ 115, బెడింగ్‌హాం 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement