
కోహ్లితో సూర్యకుమార్ యాదవ్
రెండో టీ20.. టీమిండియా, సౌతాఫ్రికా ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులివే
India vs South Africa, 2nd T20I Records Preview: అసోంలోని గువాహటి వేదికగా జరుగనున్న రెండో టీ20కి టీమిండియా, సౌతాఫ్రికా సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రాక్టీసు పూర్తి చేసుకున్న ఇరు జట్లు బర్సాపారా స్టేడియంలో ముఖాముఖి తలపడేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
మరోవైపు.. మొదటి టీ20లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ప్రొటిస్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో వర్షం ఆటంకం కలిగించకపోతే ఈ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కాగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో.. రెండో టీ20 సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లను ఊరిస్తున్న కొన్ని రికార్డులపై ఓ లుక్కేద్దాం.
మైలురాయికి చేరువలో డికాక్
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరీర్‌లో 10969 పరుగులు సాధించాడు. టీమిండియాతో రెండో టీ20లో మరో 31 పరుగులు చేస్తే తన కెరీర్‌లో 11 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
అదే విధంగా మూడు బౌండరీలు బాదాడంటే అంతర్జాతీయ టీ20లలో 200 ఫోర్లు పూర్తి చేసుకుంటాడు.
56 పరుగుల దూరంలో
అంతర్జాతీయ టీ20లలో 2 వేల పరుగుల మార్కుకు ప్రొటిస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ 56 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు పొట్టిఫార్మాట్‌లో అతడు చేసిన రన్స్ 1944.
సూర్య మరో 24 పరుగులు తీస్తే
ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌లో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సూర్య 24 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ20లలో 1000 పరుగుల మార్కును అందుకుంటాడు.
కోహ్లి మూడు క్యాచ్‌లు పడితే! పంత్ ఏమో..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ20లలో 50 క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్లలో ఒకడిగా నిలుస్తాడు. ఇక రిషభ్ పంత్ తుది జట్టులో చోటు దక్కించుకుని 66 పరుగులు చేయగలిగితే పొట్టి ఫార్మాట్ ఇంటర్నేషనల్ కెరీర్‌లో 1000 రన్స్ పూర్తి చేసుకుంటాడు.
200 వికెట్ల క్లబ్‌లో
ప్రొటిస్ ఆటగాడు కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడంటే అన్ని ఫార్మాట్లలో కలిపి 200 వికెట్లు తన ఖాతాలో పడతాయి. ఇక లుంగి ఎంగిడి ఒక వికెట్ తీస్తే అంతర్జాతీయ టీ20లలో 50 వికెట్ల మార్కు అందుకుంటాడు.
చదవండి: T20 WC: అతడి స్థానాన్ని ప్రపంచంలో ఎవరూ భర్తీ చేయలేరు.. భారత్ గెలవడం కష్టమే: ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్
Asia Cup 2022: తల్లి అంపైర్.. కూతురు ఆల్‌రౌండర్.. ఇద్దరూ ఒకేసారి! వీరికి వెనుక ఉన్నది ఎవరంటే!