
Shaun Pollock Comments On KL Rahul Captaincy: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేఎల్ రాహుల్‌ను ప్రొటిస్ మాజీ ఆటగాడు షాన్ పొలాక్ ప్రశంసించాడు. అవసరమైన సమయంలో శార్దూల్ ఠాకూర్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మకంగా వ్యవహరించాడని కితాబిచ్చాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.
ఇక అచ్చొచ్చిన వాండరర్స్ మైదానంలో ఎలాగైనా విజయం సాధించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతున్న వేళ కీలక పేసర్ తొలి రోజు ఆటలో భాగంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో భారత శిబిరం ఆందోళనలో మునిగిపోయింది. అయితే, రెండో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి అతడు అందుబాటులోకి వచ్చినా ఎలా రాణిస్తాడోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెప్టెన్ రాహుల్ వ్యూహాత్మకంగా శార్దూల్ ఠాకూర్‌ను రంగంలోకి దింపాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఏడు వికెట్లు కూల్చి సత్తా చాటాడు శార్దూల్.
ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ సారథి షాన్ పొలాక్ మాట్లాడుతూ... ‘‘నిజంగా రెండో రోజు ఆటకు ముందు టీమిండియా ముంగిట కొన్ని సవాళ్లు ఉన్నాయి. సిరాజ్ గాయపడ్డాడు. కీలక బౌలర్ ఇలాంటి పరిస్థితిలో ఉండటం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ సిట్యువేషన్‌లో ఏ కెప్టెన్ అయినా ఒత్తిడికి గురవడం సహజం. అక్కడే రాహుల్ తెలివిగా ఆలోచించాడు. ఫస్ట్ సెషన్ తర్వాత పద్ధతి మార్చాడు.
బాగానే బౌల్ చేస్తున్నారు. కానీ వికెట్లు తీయకపోతే కష్టం అనుకున్నాడేమో! ఇంకా ఏం చేయాలి? అని ఆలోచించి ఉంటాడు. శార్దూల్‌ను పంపాడు. లంచ్‌కు ముందు అతడు చేసిన అద్బుతం చూశాం కదా’’ అని రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇక టీమిండియా వెటరన్ దినేశ్ కార్తిక్ సైతం రాహుల్ కెప్టెన్సీ బాగా చేశాడంటూ అభినందించాడు.
చదవండి: WTC 2021-23 Points Table: టాప్-5లోకి బంగ్లాదేశ్... టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే!
Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు!