ఆ సమయంలో అతియా గురించి అస్సలు ఆలోచించను: కేఎల్‌ రాహుల్‌ | Dont Really Think About Her When I Step Onto The Ground: KL Rahul On Why Wife Athiya Might Kill Him - Sakshi
Sakshi News home page

KL Rahul: ఆ సమయంలో అతియా గురించి అస్సలు ఆలోచించను: కేఎల్‌ రాహుల్‌

Published Mon, Jan 1 2024 3:08 PM | Last Updated on Mon, Jan 1 2024 4:17 PM

Dont Really Think About Her When: KL Rahul Reason On Why Wife Athiya Might Kill Him - Sakshi

KL Rahul Comments: గాయాల కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పునరాగమనంలో సత్తా చాటుతున్నాడు. ఐపీఎల్‌-2023 సందర్భంగా గాయపడిన అతడు.. ఆసియా కప్‌-2023తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ వన్డే టోర్నీలో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఆ తర్వాత.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌-2023లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. అనంతరం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరిన కేఎల్‌ రాహుల్‌..తొలి మ్యాచ్‌లో అసాధారణ పోరాటంతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

సఫారీ గడ్డపై సెంచరీతో సత్తా చాటి
సాటి బ్యాటర్లంతా విఫలమైన వేళ.. సెంచరీ(101)తో రాణించి తన విలువేమిటో చాటుకున్నాడు. తద్వారా మిడిలార్డర్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అయితే, గాయాల వల్ల సతమతమైన సమయంలో తన భార్య అతియా శెట్టి, కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇదంతా సాధ్యమైందంటున్నాడు కేఎల్‌ రాహుల్‌.

స్టార్‌ స్పోర్ట్స్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ కర్ణాటక బ్యాటర్‌. ‘‘క్లిష్ట పరిస్థితుల్లో తను(అతియా) నాకు తోడుగా ఉండేది. ఇప్పుడూ ఉంది. ఇక ముందు కూడా నాతోనే ఉంటుంది.

కఠిన సమయంలో కలిసి ఉండటం ద్వారా మా మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకోగలిగాం. గాయం తాలుకు ప్రతికూల ప్రభావం నా మీద పడకుండా .. చిన్న చిన్న సంతోషాలను కూడా పూర్తిగా ఆస్వాదించేలా నాకు తోడ్పాటు అందించింది.

ఈ మాట అన్నందుకు తను నాపై కోప్పడటం ఖాయం
ఇంట్లో.. నా భార్య, కుటుంబంతో కలిసి ఉండటం మూలాన సానుకూల దృక్పథంతో క్లిష్ట పరిస్థితులను జయించగలిగాను. వేగంగా కోలుకోగలిగాను’’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు. ఇక మైదానంలో దిగిన తర్వాతే తనకు ఆట తప్ప ఇంకేదీ గుర్తుండదన్న రాహుల్‌.. ‘‘ఈ మాట చెప్తున్నందుకు తను చంపేసినా చంపేస్తుంది(నవ్వుతూ).. ఒక్కసారి గ్రౌండ్‌లోకి వెళ్లానంటే అతియా గురించి పూర్తిగా మర్చిపోతాను.

అతియాతో రాహుల్‌ ప్రేమపెళ్లి
కేవలం ఆట మీద మాత్రమే నా దృష్టి ఉంటుంది. క్రికెట్‌ అంటే నాకు ప్రాణం. అలాగే నా భార్య అంటే కూడా! తను నా కోసం ఎంతో చేసింది. ఇండస్ట్రీలో తను కూడా ఎన్నో ఎత్తుపళ్లాలు చూసింది. ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. అయినా.. నాకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు విసురుతూ నన్ను నేను మరింత మెరుగుపరచుకునేలా చేస్తుంది’’ అని సతీమణిపై ప్రశంసలు కురిపించాడు.

కాగా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునిల్‌ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టిని ప్రేమించిన కేఎల్‌ రాహుల్‌.. గతేడాది జనవరిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎప్పుటికపుడు కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తూ తమ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది.

చదవండి: IPL 2024: హార్దిక్‌ పాండ్యా దూరం! ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా బుమ్రా?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement