ద్రవిడ్‌తో కేఎల్ రాహుల్- కేఎస్ భరత్ (PC: BCCI)
Ind vs SA 2023 Test Series: కేఎల్ రాహుల్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గా పాతుకుపోయిన ఈ కర్ణాటక ఆటగాడు గత కొన్నేళ్లుగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీ శుబ్‌మన్ గిల్ మూడు ఫార్మాట్లలో స్థానం సుస్థిరం చేసుకోవడంతో.. అవసరాన్ని బట్టి నాలుగు లేదంటే ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతున్నాడు.
అంతేకాదు.. గతానికి భిన్నంగా ఇటీవలి కాలంలో వన్డే, టీ20 ఫార్మాట్లలో టీమిండియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్లలో మొదటి ప్రాధాన్యంగా మారాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో బ్యాటింగ్‌తో పాటు, అద్భుతమైన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
పంత్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది
అయితే, టెస్టుల్లో మాత్రం వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు మెరుగైన రికార్డు లేదు. ముఖ్యంగా రిషభ్ పంత్ జట్టులో ఉంటే అతడికి జట్టులో అసలు స్థానమే కరువయ్యే పరిస్థితి. కానీ.. రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ సుదీర్ఘకాలంగా ఆటకు దూరమైన నేపథ్యంలో వికెట్ కీపర్‌గా కాకపోయినా.. స్పెషలిస్టు బ్యాటర్‌గానైనా రాహుల్ జట్టులో చోటు సంపాదిస్తున్నాడు.
ఆసీస్‌తో సిరీస్ నుంచి భరత్ వికెట్ కీపర్
పంత్ గైర్హాజరీలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(ఆసీస్ వర్సెస్ ఇండియా) నుంచి ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ టెస్టుల్లో టీమిండియా వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భరత్‌ను కాదని కేఎల్ రాహుల్‌కే కీపర్‌గా బాధ్యతలు అప్పజెప్పనున్నారు. ఈ విషయాన్ని టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ధ్రువీకరించాడు.
ఇషాన్ ఇంకా నిరూపించుకోనే లేదు
ఇషాన్ కిషన్ జట్టుతో లేడు కాబట్టి వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ మాత్రమే తమకు మిగిలి ఉన్న ఆప్షన్ అని పేర్కొన్నాడు. గత ఐదారు నెలలుగా రాహుల్ కీపింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకున్నాడన్న ద్రవిడ్.. సౌతాఫ్రికాలో అతడికి గట్టి సవాలు ఎదురుకానుందని పేర్కొన్నాడు.
రాహుల్ వైపే మొగ్గు చూపిన ద్రవిడ్
అయితే, ఇక్కడ పెద్దగా స్పిన్ బౌలింగ్‌కు ఆస్కారం లేదు కాబట్టి.. కేఎల్ రాహుల్ మెరుగ్గానే కీపింగ్ చేస్తాడని భావిస్తున్నట్లు ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. రాహుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు.
తప్పుబట్టిన మాజీ వికెట్ కీపర్
ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేఎల్ రాహుల్‌ను టెస్టుల్లో కీపర్‌గా ఆడించడం సరికాదని పేర్కొన్నాడు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.
india’s test match wicketkeeper should be someone who is keeping regularly in ranji trophy or first class cricket….#imho #INDvSA #IndianCricket
— parthiv patel (@parthiv9) December 24, 2023
భరత్‌కు పరోక్ష మద్దతు
‘‘రంజీ ట్రోఫీ లేదంటే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తరచుగా కీపింగ్ చేసే ఆటగాడినే టీమిండియా టెస్టు మ్యాచ్ వికెట్ కీపర్‌గా తీసుకోవాలి’’ అని పార్థివ్ పటేల్ పరోక్షంగా కేఎస్ భరత్‌కు మద్దతునిచ్చాడు. అయితే, కేఎల్ రాహుల్ అభిమానులకు మాత్రం పార్థివ్ ఆలోచన నచ్చడం లేదు. రాహుల్- భరత్ బ్యాటింగ్ గణాంకాలు పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రాహుల్ ఏం చేస్తాడో?
పేసర్ల బౌలింగ్‌లో అద్భుతంగా కీపింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్.. రవీంద్ర జడేజా లేదంటే రవిచంద్రన్ అశ్విన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్ విషయంలో ఏ మేరకు ఆకట్టుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక పేస్, బౌన్సీ పిచ్‌లు ఉన్న సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రయోగాలు ఎంతవరకు మేలు చేస్తాయో చూడాలి!
ఇషాన్ స్థానంలో భరత్
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఇషాన్ కిషన్.. వ్యక్తిగత కారణాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో అతడి స్థానాన్ని కేఎస్ భరత్‌తో భర్తీ చేశారు టీమిండియా సెలక్టర్లు. సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భరత్‌ను ప్రధాన జట్టుకు ఎంపిక చేశారు.
చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment