సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో తొలి ఓవర్‌లోనే మూడు ఫోర్లు బాది మాంచి జోరుమీదున్నట్లు కనిపించిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (12).. ఆతర్వాత తానెదుర్కొన్న రెండో బంతికే కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మూడో ఓవర్ రెండో బంతికి ఎల్బీ కోసం కేశవ్ మహారాజ్ బిగ్గరగా అప్పీల్ చేయగా అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.
అయితే రీప్లేలో గిల్ ఔట్ కాలేదని తేలడంతో టీమిండియా అభిమానులంతా చాలా బాధపడ్డారు. రివ్యూ విషయంలో గిల్ కాస్త ధైర్యం చేసి ఉంటే ఔట్ కాకుండా బయటపడే వాడని అనుకుంటున్నారు. రిప్లే చూసిన అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ హావభావాలు నెట్టింట వైరలవుతున్నాయి. రివ్యూ తీసుకోకుండా గిల్ చాలా తప్పు చేశాడన్నట్లు ద్రవిడ్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. అసలే ఫామ్ లేమితో సతమతమవుతున్న గిల్ సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో గిల్ ఔటైన మరుసటి బంతికే తిలక్ వర్మ (0) కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు కేశవ్ మహారాజ్‌కే దక్కాయి. మూడో ఓవర్‌లోనే వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయినా టీమిండియా బ్యాటర్లు ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ (19), యశస్వి జైస్వాల్ (28) పోటాపోటీగా బౌండరీలు,సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడి సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment